వారానికి 60 + పని గంటలతో ఆరోగ్య సమస్యలు

ఆఫీసులో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడుపుతున్న ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్న ఆర్థిక సర్వే;

Advertisement
Update:2025-01-31 21:12 IST

ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థికసర్వే కీలక వివరాలు వెల్లడించింది. వారానికి 60 అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నదని తెలిపింది. ఆఫీసులో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడుపుతున్న ఉద్యోగుల్లో మానసిక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆర్థిక సర్వే పేర్కొన్నది.

సాధారణంగా ఉత్పాదకతకు పని గంటలే కొలమానంగా పరిగణిస్తుంటారు. అంతకంటే ఎక్కువ సమయం పని చేస్తే.. రిజల్ట్‌ అంత ఎక్కువగా వస్తుందని భావిస్తుంటారు. అయితే డబ్ల్యూహెచ్‌వో, ఐఎల్‌ఓ సంస్థల అధ్యయనాల ప్రకారం వారానికి 55 గంటల నుంచి 60 గంటలు దాటితే సదరు ఉద్యోగి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మానసికంగా కుంగిపోయే అవకాశం ఉన్నది. ఇదే విషయాన్ని 2024-25 ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మానవుడి మెదడు, మనసుపై సపియన్‌ ల్యాబ్స్‌ సంస్థ చేసిన పరిశోధనను ఆర్థిక సర్వే ఉటంకించింది. ఎవరైతే కార్యాలయాల్లో రోజుకు 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పనిచేస్తారో వారి మానసిక స్థితి, సాధారణ సమయం పని చేసేవారి కన్నా 100 పాయింట్లు తక్కువగా ఉంటుందట.

మరోవైపు ఆఫీసు వాతావరణం, సహోద్యోగులతో సత్సంబంధాలు కూడా ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయని ఆర్థిక సర్వే తెలిపింది. నెలకు కనీసం రెండు, మూడు రోజులు కుటుంబసభ్యులు, బంధువులతో గడపటం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిడి, మానసిక సమస్యలు తొలిగి..మెరుగైన జీవనశైలి సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ వో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులపై ఒత్తిడి, ఆందోళన కారణంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది.

ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్‌అండ్‌ టీ చైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పనిగంటలపై చర్చ మొదలైంది. పలువురు ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, సినీనటులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూడా పలుమార్లు ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. 

Tags:    
Advertisement

Similar News