బడ్జెట్‌లో బీహార్‌కు భారీ బూస్ట్
ఈ ఏడాది చివరల్లో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లోప్రత్యేక స్థానం
కేంద్రంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ మొదటిసారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీహార్ పై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివరల్లో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక స్థానం దక్కింది.బీహార్‌లో ఈ ఏడాది చివరల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సీఎం నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్నది. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నది. అయితే సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది. అయితే హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఇప్పుడు ఢిల్లీపై ఫోకస్ పెట్టింది. జార్ఖండ్‌లో ఓడిపోవడంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. అందుకే ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ రోడ్ల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చిన విషయం విదితమే.
బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థ్యం ఈ బోర్డు పని చేయనున్నది. బీహార్‌లో ఏర్పాటు చేయనున్న మఖానా బోర్డు ద్వారా వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరగుపడనున్నాయి. దీనికింద రైతులకు శిక్షణ అందుతుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనం పొందేలా బోర్డు చూస్తుందని మంత్రి వెల్లడించారు.
బీహార్ లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఐఐటీ పాట్నా సామర్థ్యాన్ని మరింత పెంచుతామన్నారు. పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటునకు నిర్ణయం తీసుకున్నది. బీహార్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మరింత మద్దతు అందనున్నది.