ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది
నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొనడంపై కాంగ్రెస్ విమర్శలు
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై విపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది . నాలుగు కీలక రంగాలను అభివృద్ధికి శక్తి ఇంజిన్లుగా పేర్కొనడంపై విమర్శలు గుప్పించింది. బడ్జెట్ రైలుకు అనేక ఇంజిన్లు ఉన్నాయని.. దీంతో ఇది కాస్త పట్టాలు తప్పిందని పేర్కొన్నది. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులు.. అనేక నాలుగు ఇంజిన్ల గురించి ఆర్థికశాఖ మంత్రి మాట్లాడారు. అభివృద్ధికి ఇది శక్తి యంత్రాలుగా పనిచేస్తాయన్నారు. కానీ చాలా ఇంజిన్లు ఉన్న ఈ బడ్జెట్ పూర్తిగా పట్టాలు తప్పింది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. తమ ప్రయోజనాల కోసమే కేంద్రం ఆ రాష్ట్రంలో బొనాంజా ప్రకటించింది. అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఇంత దారుణంగా విస్మరించారని దుయ్యబట్టారు.
మన్మోహన్‌సింగ్ హయాంలో అంతర్జాతీయ కంపెనీలు కోరుకున్న 2010 నాటి న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్‌ను నాడు అరుణ్ జైట్లీ సూచనల మేరకు బీజేపీ దెబ్బతీసిందని మరో పోస్టులో జైరాం రమేశ్ అన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను బుజ్జగించడానికి.. తాజాగా ఆర్థిక మంత్రి చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించారని ఆరోపించారు.