చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?.. - లోక్‌సభలో టీఎంసీ ఎంపీ నిలదీత

ఫలితాల రోజున ఒకవైపు స్టాక్‌ మార్కెట్‌ పడిపోయి రూ.31 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోతే, టీడీపీ అగ్రనేత భార్యకు చెందిన కంపెనీ మాత్రం రూ.521 కోట్లు ఆ ఒక్కరోజులోనే ఆర్జించిందని వెల్లడించారు. ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు.

Advertisement
Update: 2024-07-03 02:57 GMT

చంద్రబాబును ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?.. - లోక్‌సభలో టీఎంసీ ఎంపీ నిలదీత

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీరుపై తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయత లేని, అవినీతిపరులైన నేతల అండతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై సీబీఐతో, ఈడీతో దాడులు చేయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం.. అవినీతిపరులతో జత కట్టి అధికారంలో కొనసాగుతోందన్నారు.

బీజేపీతో చేరగానే.. వారంతా సుద్ధపురుషులు అయ్యారా?

అవినీతిపరులంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై గతంలో మోడీ పదేపదే ఆరోపణలు చేశారని, మరి చంద్రబాబు, అజిత్‌ పవార్, ప్రఫుల్లపటేల్‌ విషయంలో జరిగిందేమిటని ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ ప్రశ్నించారు. వీరిపై కేసులు ఇంకా పెండింగులోనే ఉన్నాయన్నారు. సీబీఐ, ఈడీలు చంద్రబాబును అరెస్ట్‌ చేస్తాయా అని నిలదీశారు. టీడీపీ అధినేతను ఎందుకు సీబీఐ, ఈడీ అరెస్ట్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పంచన చేరగానే వాషింగ్‌ మెషీన్‌లో వేసిన మాదిరి వారంతా సుద్ధపురుషులు అయ్యారంటూ ఎద్దేవా చేశారు.

అవినీతిపరులను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుచేశారు..

అవినీతిపరులైన నేతలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆగత్యం మోడీకి ఏర్పడిందని ఎంపీ బెనర్జీ దుయ్యబట్టారు. కేంద్రంలో ప్రస్తుతం అస్థిరమైన ప్రభుత్వం పాలన చేస్తుంటే, ఇంకోవైపు అత్యంత పటిష్టమైన ప్రతిపక్షం ఉందని ఆయన చెప్పారు. గతంలో స్థిరమైన ప్రభుత్వంతో నిబ్బరంగా కనిపించిన ప్రధాని మోడీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ అనే కర్రల సాయంతో సభలోకి వస్తున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు. ఆ రెండు క‌ర్ర‌లు పట్టుకునే దేశవిదేశాల్లో మోడీ తిరుగుతున్నారని చెప్పారు. గతంలోలాగా ప్రధాని మోడీలో ఆత్మస్థైర్యం కనిపించడం లేదన్నారు.

ఆ కంపెనీ మాత్రమే ఒక్కరోజులో రూ.521 కోట్లు ఎలా ఆర్జించింది?

ఎన్నికల సర్వేల అంశాలపై కల్యాణ్‌ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ కూటమి 400 సీట్లు దాటుతుందంటూ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ద్వారా ప్రచారం చేసి, స్టాక్‌ మార్కెట్‌ షేర్లు కొనాలని ప్రోత్సహించారని విమర్శించారు. ఫలితాల రోజున ఒకవైపు స్టాక్‌ మార్కెట్‌ పడిపోయి రూ.31 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోతే, టీడీపీ అగ్రనేత భార్యకు చెందిన కంపెనీ మాత్రం రూ.521 కోట్లు ఆ ఒక్కరోజులోనే ఆర్జించిందని వెల్లడించారు. ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగదని ఆయన జోస్యం చెప్పారు. మహారాష్ట్ర. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని, ఎన్నికల అధికారులు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని ఆయన విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News