కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా కేటాయించండి

కేంద్ర జలశక్తి మంత్రికి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి;

Advertisement
Update:2025-03-03 18:39 IST

తెలంగాణకు కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కేటాయించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ను సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. గోదావరిలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే ఏపీ చేపట్టే ప్రాజెక్టులకు అనుమతులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సోమవారం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలోనే ఎక్కువగా కృష్ణా పరీవాహక ప్రాంతం ఉన్నా కేఆర్‌ఎంబీ తీరుతో నష్టపోతున్నామని అన్నారు. ఈ ఏడాది కేటాయింపులకు మించి ఏపీ నీటిని తీసుకుపోయిందని, ఇకపై అలా జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. కృష్ణా నదిలో ఎవరు ఎంత నీటిని వినయోగించుకుంటున్నారో లెక్కించేందుకు టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ 2022లోనే సీడబ్ల్యూసీకి సమర్పించినా అనుమతుల మంజూరులో ఆలస్యమవుతోందన్నారు. న్యాయవివాదాలు ఉన్నా కర్నాటకలోని అప్పర్‌ భద్రకు అనుమతులు ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులను విస్మరిస్తున్నారనే విషయాన్ని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. సీతారామ ఎత్తిపోతలు, సమ్మక్క సాగర్‌ బ్యారేజీలను త్వరగా అనుమతులు ఇప్పించాలన్నారు.

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. పాలమూరు - రంగారెడ్డి, సీతారామ, మోడికుంట వాగు, చనాకా కొరాటా డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్‌, చిన్నకాళేశ్వరం ప్రాజెక్టులకు ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తామని.. దీనికి సంబంధించిన ముంపు మహారాష్ట్రలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కోరారు. సీఎం వెంట ఎంపీ రఘువీర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు రాహుల్‌ బొజ్జా, మాణిక్‌ రాజ్‌, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గౌరవ్‌ ఉప్పల్‌, ఈఎన్సీ విజయ్‌ భాస్కర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News