రీజినబుల్‌ టైం అంటే అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా?

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరోసారి ప్రశ్నించిన సుప్రీం కోర్టు;

Advertisement
Update:2025-03-04 16:54 IST

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి రీజనబుల్‌ టైం కావాలని అంటున్నారని.. రీజనబుల్‌ టైం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? అని సుప్రీం కోర్టు మరోసారి ప్రశ్నించింది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మంది కాంగ్రెస్‌ లో చేరారని.. వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేసినా స్పీకర్‌ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌ ను విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం విచారించింది. బీఆర్‌ఎస్‌ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ అనర్హత పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ పిటిషన్‌లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవడం అంటే రాజ్యాంగం కల్పించిన విధి నిర్వహణలో విఫలమైనట్టేనని అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ తరపున అడ్వొకేట్‌ జోక్యం చేసుకుంటూ స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి రీజనబుల్‌ టైం కావాలనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ దశలో జస్టిస్‌ గవాయి జోక్యం చేసుకుని.. రిజనబుల్‌ టైం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరకా? అలాగైతే ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని ప్రశ్నించారు. స్పీకర్‌ కు ఎంత సమయం కావాలో చెప్పాలన్నారు. ఆపరేషన్‌ సక్సెస్‌.. పేషంట్‌ డెడ్‌ అనే తీరు సరికాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో ప్రతివాదులు ఈనెల 25లోగా కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో తాము ఇదివరకే ఇచ్చిన నోటీసులకు ఈనెల 22లోగా సమాధానం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, హైకోర్టు రిజిస్టార్‌లను ఆదేశించింది. తమకు నోటీసులు అందలేదని ప్రతివాదులు వివరించడంతో వారికి 22వ తేదీ వరకు సమయమిస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో కౌంటర్లను ఈనెల 25లోగా దాఖలు చేయాలని, అదే రోజు కేసును మళ్లీ విచారిస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పది మంది ఎమ్మెల్యేలు సైతం తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించింది. స్పీకర్‌ కు రీజనబుల్‌ టైం ఇవ్వాలని గతంలోనే అసెంబ్లీ సెక్రటరీ తరపు అడ్వొకేట్‌ వాదించగా ఆయనపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్‌ కు ఎంత సమయం కావాలో చెప్పకుంటే ఆ సమయం ఎంతకాలం అనేది తామే నిర్ణయిస్తామని తేల్చిచెప్పింది.

తదుపరి విచారణ మార్చి 25 కు వాయిదా

Tags:    
Advertisement

Similar News