ఉదయనిధికి సుప్రీంకోర్టు నోటీసులు

సనాతన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఉదయనిధితో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement
Update:2023-09-23 06:52 IST

తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మం వ్యాఖ్యాలపై స్పందన తెలియజేయాలంటూ ఉదయనిధితో పాటు తమిళనాడు ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు తాఖీదులు పంపించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఇటీవల ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది.

సనాతన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఉదయనిధితో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. చెన్నైకి చెందిన న్యాయవాది బి.జగన్నాథ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో పలుమార్లు ఎఫ్ఐఆర్ నమోదుకు, ఇతరత్రా ఆదేశాలు జారీ చేసినట్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకొని వచ్చారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి.. ప్రతివాదులకు నోటీసులు పంపించింది.

సనాతన ధర్మం మంచిది కానదని చెప్పాలని ఉదయనిధి స్కూల్ విద్యార్థులను కోరుతున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది దామ శేషాద్రినాయుడు కోర్టుకు తెలిపారు. ఒక వ్యక్తి నిర్ధిష్ట వర్గం లేదా విశ్వాసం గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వమే తన యంత్రాంగాన్ని పురమాయించడం ఆందోళనకరంగా ఉందని ఆయన వాదించారు. కాగా, ఈ కేసును మద్రాసు హైకోర్టులో దాఖలు చేయవచ్చు కదా అని ప్రశ్నించగా.. సుప్రీంకోర్టు ఇటువంటి కేసులను గతంలో పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఒక ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సర్క్యులర్లు జారీ చేస్తున్నారని.. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి రాష్ట్ర మంత్రి కావడంతో ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదు చేయడం లేదని శేషాద్రినాయుడు చెప్పారు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ప్రకటనలు చేయకుండా ఉదయనిధిని కట్టడి చేయాలని, ఎఫ్ఐఆర్‌కు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. మీరు సుప్రీంకోర్టును పోలీస్ స్టేషన్‌గా మార్చేస్తున్నారు. మీరు హైకోర్టుకు వెళ్లి చూడాల్సింది. ప్రస్తుతానికి మేం నోటీసులు జారీ చేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.

Tags:    
Advertisement

Similar News