ఆర్థిక సంక్షోభంలో కేరళ.. కేంద్రం వల్లే ఈ దుస్థితి : సీఎం పినరయ్ విజయన్

కేఐఐఎఫ్‌బీ ద్వారా ఫండింగ్ చేయబడిన ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం పినరయ్ విజయన్ ఈ విషయాలను వెల్లడించారు.

Advertisement
Update:2023-08-08 18:31 IST

కేరళ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కేరళ ఆర్థిక పరిస్థితిపై పలు విషయాలు వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నదని అన్నారు. రాష్ట్రం తీసుకున్న రుణాలను కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డు (కేఐఐఎఫ్‌బీ)కి జోడించడంతో.. రుణ పరిమితి పెరిగిపోయి కొత్త అప్పులు తీసుకోవడానికి అడ్డంకిగా మారిందని విజయన్ అసెంబ్లీకి చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని అసెంబ్లీలో ప్రకటించారు.

కేఐఐఎఫ్‌బీ ద్వారా ఫండింగ్ చేయబడిన ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సీఎం పినరయ్ విజయన్ ఈ విషయాలను వెల్లడించారు.రాష్ట్రంలోని మౌలిక వసతులు, రోడ్లు, ఫిషరీస్, ఎడ్యుకేషన్, కోస్తాతీర అభివృద్ధి వంటి రంగాల్లో అమలు చేయాల్సిన పథకాలు, నిర్మించాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక వివరాలను పినయర్ విజయన్ వివరించారు.

కేఐఐఎఫ్‌బీ తీసుకునే రుణాలకు కేరళ ప్రభుత్వం భాద్యత ఏమీ ఉండదని.. కానీ దాని అప్పులను కూడా ప్రభుత్వ అప్పుల కింద కేంద్రం చూస్తోందని సీఎం విజయన్ అన్నారు. కేఐఐఎఫ్‌బీ ద్వారా కేరళ ప్రభుత్వం కేవలం ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు రూ.13,389 కోట్ల విలువైన పనులు దీని ద్వారా పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బోర్డు ద్వారా రూ.904 కోట్ల మేర పనులు జరగాల్సి ఉన్నది. అయితే, కేఐఐఎఫ్‌బీ అప్పులతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. అదొక ప్రత్యేక స్వయంప్రతిపత్తి సంస్థ అని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పేర్కొన్నారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) తీసుకునే భారీ అప్పులు ఏనాడూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా చూపరు. కానీ కేఐఐఎఫ్‌బీ తీసుకున్న రుణాలను మాత్రం కేరళ ప్రభుత్వం ఖాతాలో వేస్తున్నారని సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. దీని వల్లే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు నిధుల సమీకరణ కష్టంగా మారిందని, కేంద్రం నుంచి కూడా రావల్సిన నిధులు రావడం లేదని.. దీంతో కేరళ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోందని సభకు తెలియజేశారు.

Tags:    
Advertisement

Similar News