సింధు బంగారు కల నిజమాయెగా!

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కెనడాకు చెందిన మిచెల్లీ లీపై సింధు ఘనవిజయం సాధించింది.

Advertisement
Update:2022-08-08 15:41 IST

తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ గేమ్స్ లో తన బంగారు కలను ఎట్టకేలకు నెరవేర్చుకొంది. తన మూడో ప్రయత్నంలో సఫలం కావడం ద్వారా కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ లోటును పూడ్చుకొంది.

బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ ఆఖరిరోజు పోటీలలో భాగంగా జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడా ప్లేయర్ మిచెల్లీ లీని వరుస గేమ్ ల్లో టాప్ సీడ్ సింధు చిత్తు చేసింది.


గత రెండు కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య, రజత పతకాలు మాత్రమే సాధించిన సింధు..వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరడం ద్వారా బంగారు పతకానికి మార్గం సుగమం చేసుకొంది.

నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ లో సైనా నెహ్వాల్ చేతిలో ఓటమి పొంది..రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అయితే..ప్రస్తుత గేమ్స్ లో ఇప్పటికే మిక్సిడ్ టీమ్ రజత పతకం సాధించిన 27 సంవత్సరాల సింధు..సింగిల్స్ లో తిరుగులేని విజయాలతో విజేతగా నిలిచింది.

మిచెల్లీ లీని 21-15, 21-13తో సింధు అలవోకగా ఓడించడం ద్వారా భారత బంగారు పతకాల సంఖ్యను 19కి పెంచింది. ప్రస్తుత క్రీడల ప్రారంభవేడుకలలో భారతబృందానికి సంయుక్త పతాకధారిగా వ్యవహరించిన సింధు కు 2014 కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ మిచెల్లీ ఏమాత్రం సరిజోడీ కాలేకపోయింది.


ఇప్పటికే ఒలింపిక్స్ లో రెండు పతకాలు నెగ్గిన ప్రపంచ మాజీ చాంపియన్ సింధుకి కామన్వెల్త్ గేమ్స్ లో ఇది మూడో పతకం కావడం విశేషం.

కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో వరుసగా మూడుసార్లు కాంస్య, రజత, స్వర్ణ పతకాలు నెగ్గిన భారత ఏకైక క్రీడాకారిణిగా సింధు అరుదైన రికార్డు నమోదు చేసింది.

Tags:    
Advertisement

Similar News