పార్లమెంట్‌ ఆవరణలో రాహుల్‌ వినూత్న నిరసన

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ పార్లమెంటుకు వెళ్తుండగా.. ఆయనకు జాతీయ జెండా, గులాబీని ఇచ్చిన విపక్ష నేత

Advertisement
Update:2024-12-11 14:07 IST

శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారం, యూపీలోని సంభల్‌ అల్లర్లు తదిర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో గత వారమంతా సభా కార్యకలాపాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటు ఆవరణలో దీనిపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ఇందులోభాగంగా కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ బుధవారం పార్లమెంట్‌ ఆవరణలో నిల్చొని సమావేశాలకు హాజరైన బీజేపీ నేతలకు త్రివర్ణ పతాకం, గులాబీలు అందజేస్తూ నిరసన తెలిపారు. అదే సమయంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ పార్లమెంటుకు వెళ్తుండగా.. రాహుల్‌ గాంధీ, ఇతర నేతలు ఆయన వద్దకు వచ్చిన జాతీయ జెండా, గులాబీని ఇచ్చి.. చిరునవ్వులు చిందిస్తూ వెనక్కి వెళ్లారు. ఈ సంఘటనను పలువురు ఎంపీలు ఆసక్తిగా చూశారు.

దీనిపై కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ మాట్లాడుతూ.. ఇతర విషయాల కంటే దేశం చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని బీజేపీ నేతలు తెలియజేయాలనే ఉద్దేశంతో వారికి జాతీయ జెండాలు ఇచ్చామన్నారు. సోవారం పార్లమెంటు ఆవరణలో అదానీ, ప్రధాని మోడీ మాస్కులతో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఇంతర్వ్యూ నిర్వహించిన విషయం తెలిసిందే. మంగళవారం కాంగ్రెస్‌ నేతలు ప్రధాని, అదానీ ఫొటోలతో ఉన్న వినూత్నమైన బ్యాగులు ధరించి నిరసన తెలిపారు. బ్యాగ్‌కు ఒకవైపు ప్రధాని నరేంద్రమోడీ, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఫొటో, మరోవైపు మోదీ, అదానీ భాయ్‌ భాయ్‌ అనే నినాదంతో ముద్రించి ఉన్నది. అదానీ వ్యవహారంపై పార్లమెంటు చర్చ జరపాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్‌ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నది. కాగా.. విపక్షాల ఆందోళనతో నేడు కూడా వాయిదాల పర్వం కొనసాగుతున్నది.

Tags:    
Advertisement

Similar News