మోదీ అదానీ ఏక్ హై, అదానీ సేఫ్ హై
అదానీ వ్యవహారంపై జేపీసీ ద్వారా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీల నిరసన
అదానీ వ్యవహారంపై జేపీసీ ద్వారా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు ప్రాంగణం ముందు నిరసనకు దిగారు. 'మోదీ అదానీ ఏక్ హై, అదానీ సేఫ్ హై' అని రాసి ఉన్న స్టిక్కర్లు కలిగిఉన్న నల్లని డ్రెస్‌లు ధరించి ఆందోళన చేశారు. అదానీ వ్యవహారంపై ప్రధాని మోడీ విచారణ జరపలేరని లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. అలా చేస్తే ప్రధాని తనపై దాను దర్యాప్తు చేసుకున్నట్లు అవతుందని విమర్శించారు. మోదీ, అదానీ ఇద్దరు కాదని ఒక్కరేనని ఎద్దేవా చేశారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని, సభలో ఈ అంశంపై ప్రధాని నోరు మెదపాలని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంటు మకరం ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంటు ఎదుట ఎటువంటి ఆందోళనలు చేపట్టకూడదని మంగళవారం ఆదేశాలు జారీ చేసినా ఎంపీలు నిరసన చేపట్టడం పై స్పీకర్ ఓం బిర్లా మండిపడ్డారు. అనంతరం సంవిధాన్ సదన్ ముందు బైఠాయించిన ఇండియా కూటమి ఎంపీలు మోదీ అదానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలుఈ నిరసనలకు దూరంగా ఉన్నారు.