వృద్ధులకు మోడీ సర్కార్ షాక్
Senior citizen concession tickets: ప్రయాణికుల సేవలపై గతేడాది 59 వేల కోట్ల రూపాయలు రాయితీల రూపంలో రైల్వే భరించిందన్నారు. ఇది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కంటే అధికమని వివరించారు.
వృద్ధుల విషయంలో ఇప్పట్లో కనికరం చూపలేమని కేంద్రం ప్రకటించింది. రైలు ప్రయాణంలో వృద్థులకు ఇచ్చే రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది. కరోనా సమయంలో రద్దు చేసిన వృద్ధులకు రాయితీలను తిరిగి ఎప్పుడు పునరుద్దరిస్తారని అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.
ఇప్పట్లో రాయితీలను పునరుద్ధరించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రైల్వేలో పింఛన్లు, జీతాల భారం అధికంగా ఉందని, కాబట్టి రాయితీలు కష్టమైన విషయమని చెప్పారు. పింఛన్ల కోసం ఏటా 60వేల కోట్లు, వేతనాల కోసం 97వేల కోట్లు, ఇంధనం కోసం 40వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.
ప్రయాణికుల సేవలపై గతేడాది 59 వేల కోట్ల రూపాయలు రాయితీల రూపంలో రైల్వే భరించిందన్నారు. ఇది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ కంటే అధికమని వివరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వృద్ధులకు రాయితీలు పునరుద్ధరించే అవకాశం ఇప్పట్లో లేదని బదులిచ్చారు. రాయితీలు ఇచ్చే ముందు రైల్వే ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు.