మాజీ భాగస్వామిని ''అతిథి దేవోభవ''లా చూడండి - హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

పిల్లలను చూసేందుకు మాజీ భర్త గానీ, మాజీ భార్య గానీ వచ్చిన సమయంలో ఒకరు మరొకరి పట్ల దురుసుగా వ్యవహరించిన అనేక ఉదంతాలు తన దృష్టికి వచ్చాయని జస్టిస్ రామస్వామి వ్యాఖ్యానించారు. భార్యభర్తలు కాకపోయినప్పటికీ.. ఇంటికి వచ్చిన మాజీ భాగస్వామిని ఒక అతిథిగానైనా చూడాలన్నారు.

Advertisement
Update:2022-07-22 09:41 IST

విడిపోయిన దంపతులు... తమ బిడ్డను కలిసే హక్కుల విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ కృష్ణన్‌ రామస్వామి విడిపోయి దూరంగా ఉంటున్న జంటకు కీలక సూచనలు చేశారు. విడిపోయిన దంపతులు తమ పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. బిడ్డను చూసేందుకు మాజీ భాగస్వామి వచ్చిన సమయంలో మరో భాగస్వామి గౌరవప్రదంగా వ్యవహరించాలని, దురుసుగా ప్రవర్తించడం లాంటివి చేయకూడదని స్పష్టం చేశారు.

పిల్లలను చూసేందుకు మాజీ భర్త గానీ, మాజీ భార్య గానీ వచ్చిన సమయంలో ఒకరు మరొకరి పట్ల దురుసుగా వ్యవహరించిన అనేక ఉదంతాలు తన దృష్టికి వచ్చాయని జస్టిస్ రామస్వామి వ్యాఖ్యానించారు. భార్యభర్తలు కాకపోయినప్పటికీ.. ఇంటికి వచ్చిన మాజీ భాగస్వామిని ఒక అతిథిగానైనా చూడాలన్నారు. అతిథి దేవోభవ అన్నది మన ఆచారాల్లోనే ఉందన్నారు.

పిల్లల్లో ద్వేషం అన్నది సహజంగా రాదని... చాలా ఉదంతాల్లో నూరిపోయడం వల్లనే వస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిల్లల ముందు తల్లిదండ్రులు పరస్పరం దూషించుకోవడం వంటి చర్యల వల్ల పిల్లల మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం ఉంటుందన్నారు. దంపతులు తమ పిల్లలకు ఒకరిపై మరొకరి ద్వేషం కలిగేలా, భయం కలిగేలా నూరిపోయడం సరికాదన్నారు.

దంపతులు విడాకులు తీసుకున్నా.. తల్లి, తండ్రి నుంచి ఇరువురితో ప్రేమ, ఆప్యాయత, మంచి సంబంధాలు కలిగి ఉండే హక్కు వారికి జన్మించిన పిల్లలకు ఉంటుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితులను పిల్లలకు నిరాకరించడం అంటే బాలల హక్కుల ఉల్లంఘనే అవుతుందని కోర్టు హెచ్చరించింది.

తాను విచారించిన కేసులో మైనర్ అయిన బాలికను వారంలో నిర్ణీత సమయం పాటు తన ఇంటికి తండ్రి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అయితే ఈ ఆదేశాల అమలు ఇబ్బందులు తెచ్చిపెడుతాయని, కాబట్టి సవరించాలని తల్లి విజ్ఞప్తి చేశారు. దాంతో తన ఆదేశాలను సవరించిన న్యాయమూర్తి... కూతురిని చూసేందుకు వారంలో ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తల్లి నివాసానికే వెళ్లి కుమార్తెను చూసి రావాలని ఉత్తర్వులు ఇచ్చారు. మాజీ భర్త వచ్చిన సమయంలో అతడి పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని మహిళకు కోర్టు సూచించింది. మీ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం బిడ్డపై పడకుండా వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఇంటికి వచ్చిన మాజీ భర్తను అతిథి దేవోభవ తరహాలో గౌరవించాలని, కలిసి భోజనం చేయాలని న్యాయమూర్తి సూచించారు.

Tags:    
Advertisement

Similar News