'ఇకపై మందుల చీటీపై శ్రీహరి అని రాసి హిందీలో మందుల పేర్లు రాయాలి'

హిందీ లో వైద్య విద్యను ప్రారంభిస్తోంది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ...ఇకపై వైద్యులు ప్రిస్క్రిప్షన్ స్లిప్పుల పైన ‘శ్రీ హరి’ అని రాసి, మందుల జాబితాను హిందీలో రాయవచ్చని వ్యాఖ్యానించారు.

Advertisement
Update:2022-10-16 08:50 IST

ఒకవైపు దక్షిణ, ఈశాన్య భారత రాష్ట్రాల్లో హిందీ వ్యతిరేక నిరసనలు వస్తున్న నేపథ్యంలో హిందీ రుద్దే కార్యక్రమం మొదలుపెట్టింది బీజేపీ ప్రభుత్వం... హిందీలో వైద్య విద్య పాఠ్యపుస్తకాలను ఈ రోజు మధ్యప్రదేశ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ...ఇకపై వైద్యులు ప్రిస్క్రిప్షన్ స్లిప్పుల పైన 'శ్రీ హరి' అని రాసి, మందుల జాబితాను హిందీలో రాయవచ్చని వ్యాఖ్యానించారు.

ఆదివారం భోపాల్ మోతీలాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో వైద్య విద్య సిలబస్‌కు సంబంధించిన హిందీ పాఠ్యపుస్తకాలను అమిత్ షా ఆవిష్కరించనున్నారు.దీనిపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో శనివారం శివరాజ్ సింగ్ మాట్లాడారు.

దేశంలోనే హిందీలో వైద్య విద్యను అందిస్తున్న తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించనుందని ముఖ్యమంత్రి అన్నారు

"ఒక గ్రామంలోని అత్యంత పేదవాడు కూడా ఆస్తులు అమ్మేసైనా సరే పిల్లలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో చదివించాలని భావిస్తాడు" అని అన్నారు. ఇంగ్లీషు రాకపోవడం వల్ల ఎవరైనా మెడికల్ కాలేజీలో చదువు మానేయకూడదని సీఎం అన్నారు. పెద్దలు తమ పిల్లల్లో హిందీ పట్ల ఉన్న తక్కువ భావాన్ని మార్చాలని, హిందీ అంటే గర్వపడేలా చేయాలని సూచించారు.

"ప్రతి గ్రామానికి డాక్టర్ అవసరం. వారు ఇకపై వారు హిందీలో ప్రిస్క్రిప్షన్లు రాస్తారు. 'క్రోసిన్' అని రాయాల్సి వస్తే ప్రిస్క్రిప్షన్ పైన 'శ్రీ హరి' అని రాసి హిందీలో క్రోసిన్ అని రాస్తారు," అని అన్నారాయన.

ఇదిలా ఉండగా, ఆదివారం నాటి అమిత్ షా కార్యక్రమానికి విద్యార్థులను బలవంతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.

"అమిత్ షా మాస్ లీడర్ అయితే, రాష్ట్ర ప్రభుత్వం తమ విద్యార్థులను కార్యక్రమానికి పంపమని విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? విద్యార్థులు కార్యక్రమానికి హాజరుకాకపోతే సెమిస్టర్‌ను నిలిపివేస్తామని, ఇతర చర్యలు కూడా తీసుకుంటామని బెదిరిస్తున్నారు, "అని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా విభాగం చైర్‌పర్సన్ కెకె మిశ్రా ఆరోపించారు.

హిందీ రాష్ట్రాల్లో హిందీలో ప్రిస్క్రిప్షన్లు రాయడం వరకు సరే కానీ ప్రిస్క్రిప్షన్లపై 'శ్రీహరి' అని కూడా రాయాలనడం చూస్తూ ఉంటే ఇది ఒక భాషకు సంబంధించిన వ్యవహారంలాగా అనిపించడంలేదు అనే విమర్శలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News