కాలేజ్ స్టూడెంట్స్ కి మెటర్నిటీ లీవ్.. దేశంలో ఇదే ఫస్ట్ టైం

ఒకవేళ సెమిస్టర్ మధ్యలో మాతృత్వ సెలవులు తీసుకున్న విద్యార్థినులు ఆ తర్వాత పరీక్షలు రాసేందుకు అనుమతించనున్నట్లు వారు తెలిపారు. దీనివల్ల ఆ విద్యార్థినులు సెమిస్టర్ నష్టపోకుండా ఉండొచ్చని వారు చెప్పారు.

Advertisement
Update:2022-12-24 19:30 IST

దేశంలో మొట్టమొదటిసారి ఒక యూనివర్సిటీ తమ వర్సిటీ పరిధిలో చదివే విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కాలేజీలలో విద్యార్థినుల కోసం మెటర్నిటీ లీవ్ ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి. మామూలుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు మాతృత్వ సెలవులు మంజూరు చేస్తుంటారు. అమ్మతనాన్ని ఆస్వాదించడంతోపాటు, తమ బిడ్డ బాగోగులు చూసుకునేందుకుగాను ఆయా సంస్థలు మెటర్నిటీ లీవ్ ఇస్తుంటాయి.

కొన్ని సంస్థలు అయితే పురుషులకు కూడా పితృత్వ సెలవులు మంజూరు చేస్తుంటాయి. డెలివరీ అయిన సమయంలో భార్యకు సహాయంగా ఉండేందుకు, బిడ్డను చూసుకునేందుకుగాను వారికి ఈ సెలవులు ఇస్తుంటారు. అయితే కళాశాల విద్యార్థినులకు మాతృత్వ సెలవులు ఇవ్వటం ఇప్పటివరకు లేదు.

కొంతమంది తల్లిదండ్రులు మంచి సంబంధం వచ్చిందనో, లేకపోతే కుటుంబ పరిస్థితుల కారణంగానో తమ కుమార్తెలకు త్వరగా పెళ్లిళ్లు చేస్తుంటారు. అలాంటి విద్యార్థినులు సెలవులు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కేరళ కొట్టాయంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ చదివే విద్యార్థినులకు 60 రోజుల పాటు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. గర్భధారణ కారణంగా విద్యార్థినుల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఒకవేళ సెమిస్టర్ మధ్యలో మాతృత్వ సెలవులు తీసుకున్న విద్యార్థినులు ఆ తర్వాత పరీక్షలు రాసేందుకు అనుమతించనున్నట్లు వారు తెలిపారు. దీనివల్ల ఆ విద్యార్థినులు సెమిస్టర్ నష్టపోకుండా ఉండొచ్చని వారు చెప్పారు. అయితే మాతృత్వ సెలవులు తొలి లేదా రెండో కాన్పున‌కు మాత్రమే వర్తిస్తాయి. డిగ్రీ కానీ పీజీ కానీ చదివే విద్యార్థినులు కోర్సులో ఒకసారి మాత్రమే ఈ సెలవులను ఉపయోగించుకోవాలి. ఇక గర్భస్రావం, ట్యూబెక్టమీ చేయించుకున్న వారికి కూడా 14 రోజులు సెలవులు మంజూరు చేయాలని ఆ యూనివర్సిటీ నిర్ణయించింది.

Tags:    
Advertisement

Similar News