ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి.. 100 అడుగుల ఎత్తు నుంచి దూకి నీట మునిగిన యువకుడు
100 అడుగుల ఎత్తు నుంచి చెరువులోకి దూకడంతో తౌసిఫ్ తీవ్రంగా గాయపడి సెకండ్ల వ్యవధిలోనే నీటిలో మునిగిపోయాడు. వెంటనే తౌసిఫ్ స్నేహితులు అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
యువతకు రీల్స్ పిచ్చి ఎక్కువైంది. సోషల్ మీడియాలో పాపులర్ కావాలని, డబ్బు సంపాదించాలన్న ఆశతో రీల్స్ పేరిట వారు చేస్తున్న పిచ్చి పనులు వారి ప్రాణాలనే తీస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఓ యువకుడు 100 అడుగుల ఎత్తు నుంచి చెరువులోకి దూకి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రం సాహిబ్ గంజ్ లో జరిగింది.
జిర్వాబారిలోని మజర్ తోలా ప్రాంతానికి చెందిన మహమ్మద్ తౌసిఫ్ స్నేహితులతో కలిసి కారం కొండ వద్ద ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలోనే వారు నీటిలోకి దిగి రీల్స్ చేయడం ప్రారంభించారు. తాను కొండపైకి వెళ్లి 100 అడుగుల ఎత్తు నుంచి చెరువులోకి దూకుతానని ఆ సమయంలో రీల్స్ కోసం వీడియో తీయాలని స్నేహితులకు చెప్పిన మహమ్మద్ తౌసిఫ్ కొండపైకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక్కసారిగా చెరువులోకి దూకాడు.
దీనిని తౌసిఫ్ స్నేహితులు వీడియో తీశారు. అయితే 100 అడుగుల ఎత్తు నుంచి చెరువులోకి దూకడంతో తౌసిఫ్ తీవ్రంగా గాయపడి సెకండ్ల వ్యవధిలోనే నీటిలో మునిగిపోయాడు. వెంటనే తౌసిఫ్ స్నేహితులు అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చెరువులోకి దిగి తౌసిఫ్ జాడ కోసం వెతికారు.
కొన్ని గంటల తర్వాత పోలీసులు యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. తౌసిఫ్ మృతదేహాన్ని చూసి అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, తౌసిఫ్ కొండపై నుంచి చెరువులోకి దూకడం, ఆ తర్వాత వెంటనే అతడు నీటిలో మునిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.