విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన సోరేన్ స‌ర్కార్

బీజేపీ కుట్రలను ఛేదిస్తూ జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ సర్కార్ బల నిరూపణలో విజయవంతం అయ్యింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో అధికార కూటమికి 49 ఓట్లు వచ్చాయి.

Advertisement
Update:2022-09-05 10:00 IST

జార్ఖండ్ లో హేమంత్ సోరేన్ ప్ర‌భుత్వం విశ్వాస ప‌రీక్ష లో విజ‌యం సాధించింది. సోరేన్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కేవ‌లం ఈ ప‌రీక్ష‌ను ఎదుర్కొనేందుకే ముఖ్య‌మంత్రి సోరేన్ సోమ‌వారంనాడు ప్ర‌త్యేకంగా అసెంబ్లీ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. త‌న ప్ర‌భుత్వం స‌భా విశ్వాసాన్ని కోరుతూ ఆయ‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దీనిపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడుతూ బిజెపి పై విరుచుకు ప‌డ్డారు. ఆ పార్టీ వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని విమ‌ర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యం పోసి దేశంలో "అంతర్యుద్ధం లాంటి పరిస్థితిని క‌ల్పించేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని హేమంత్ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ "జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం"లో పాలుపంచుకున్నారని ఆయన ఆరోపించారు.

యుపిఎ కూట‌మిలోని ఎమ్మెల్యేల ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న అధికార సంకీర్ణ కూట‌మి ఆరోపణల మధ్య ముఖ్య‌మంత్రి సోరేన్ విశ్వాస ప‌రీక్ష‌కు సిద్ధ‌ప‌డ్డారు.

''రాష్ట్రంలో విప‌క్ష బిజెపి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది. శాసనసభ్యులతో బీజేపీ బేర‌సారాలు చేస్తోంది. బిజెపి కుట్ర‌లు సాగ‌వివ్వ‌బోం.. సభలో మా సత్తా చూపుతాం'' అని ముఖ్య‌మంత్రి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ గంద‌ర‌గోళం సృష్టించినా సీఎం సోరేన్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.

ప్రజలు బట్టలు, రేషన్, కిరాణా స‌రుకులు వంటివి మార్కెట్లో కొంటారని మ‌న‌కు తెలుసు. కానీ బిజెపి మాత్రమే శాసనసభ్యులను కొనుగోలు చేస్తుందని ఆయన ఆరోపించారు. కాగా ఓటింగ్ స‌మ‌యంలో బిజెపి స‌భ్యులు గంద‌ర గోళం సృష్టిస్తూ స‌భ నుంచి వాకౌట్ చేశారు.

అధికార యుపిఎ కూట‌మి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ నుండి ప్రత్యేక విమానంలో నిన్న సాయంత్రం రాష్ట్ర రాజధాని రాంచీకి తిరిగి వ‌చ్చారు. బిజెపి కుటిల ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు ముందు జాగ్ర‌త్త‌గా త‌మ ఎమ్మెల్యేల‌ను చ‌త్తీస్‌గ‌డ్ త‌ర‌లించారు. రాత్రి అక్క‌డి నుంచి వ‌చ్చి స్టేట్‌గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ ఉద‌యం బ‌స్సుల‌లో నేరుగా అసెంబ్లీకి వ‌చ్చారు.

రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి సోరేన్ త‌న‌కు తానుగానే గ‌నుల లీజును కేటాయించుకున్నార‌ని ఆరోపిస్తూ ఆయ‌న‌ను ఎమ్మెల్యేగా అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని బిజెపి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎన్నిక‌ల‌క‌మిష‌న్ గ‌వ‌ర్న‌ర్ ర‌మేష్ కు నివేదిక ఇచ్చింది. దీని ప్ర‌కారం సోరేన్ పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌నుంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీనిని సాకుగా తీసుకుని బిజెపి జెంఎంఎం సంకీర్ణ కూట‌మి ప్ర‌బుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే అంతా ఊహించిన‌ట్టు గ‌వ‌ర్న‌ర్ నుంచి ఎటువంటి చ‌ర్య‌లూ క‌న‌బ‌డ‌లేదు. ఈ సందిగ్ధ ప‌రిస్థితికి చెక్ చెప్పేందుకు, త‌మ ఎమ్మెల్యేలంతా త‌న‌తో ఉన్నార‌ని నిరూపించేందుకు ముఖ్య‌మంత్రి సోరేన్ ఈ విశ్వాస ప‌రీక్ష‌ను ఎదుర్కొని విజ‌యం సాధించారు.

81 మంది సభ్యుల అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అతిపెద్ద పార్టీ అయిన జెఎంఎం కి 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 18, తేజస్వి యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ కి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలున్నారు. మెజారిటీ మార్క్ 41 కాగా ముఖ్య‌మంత్రి హేమంత్ సోరేన్ స‌ర్కార్ 48 మంది మ‌ద్ద‌తుతో విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గింది.

Tags:    
Advertisement

Similar News