సెప్టెంబర్ 2న నింగిలోకి ఆదిత్య ఎల్-1.. వివరాలివే..
ఆదిత్య ఎల్-1ను PSLV-XL రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుపానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది.
చంద్రయాన్ - 3 ప్రయోగం సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం చేపట్టే ఆదిత్య ఎల్-1 ప్రయోగ తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు ఆదిత్య ఎల్-1 ను శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్రో తన అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది.
ఇక ఆదిత్య ఎల్-1ను PSLV-XL రాకెట్ నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుపానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది. ఇందుకోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్లనుంది ఆదిత్య ఎల్-1. ఫొటోస్పియర్, క్రోమోస్పియర్.. సూర్యుడి బయటి పొరపై అధ్యయనంలో చేయడంలో ఉపయోగపడనున్నాయి. ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపడుతున్నారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ ఎల్-1 వద్ద ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను మోహరించనున్నారు. చంద్రునితో పోల్చుకుంటే ఈ దూరం నాలుగు రెట్లు ఎక్కువ. సూర్యుడిపై పరిశోధనలకు అంతరిక్షంలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ స్పేస్‌క్రాఫ్ట్ పని చేయనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం.
ఇప్పటికే బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్లో సిద్ధం చేసిన ఆదిత్య - L1 ఉపగ్రహాన్ని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ప్రత్యేక కంటైనర్‌లో శ్రీహరికోట స్పేస్ సెంటర్కు తరలించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను డెవలప్ చేశాయి.
*