`భారత్`కు మారితే.. ఆ వెబ్‌సైట్లకు డొమైన్ కష్టాలు..!
ఇండియా నుంచి భారత్‌కు మన దేశం పేరును మార్చితే అనేక రకాల మార్పులు సంభవించడం తథ్యం. అందులో తమ పేరులో .ఇన్ (.in) కలిపి ఉన్న దేశంలోని వేలాది వెబ్‌సైట్‌లకు ఐడెంటిటీ సమస్యలు రానున్నాయి.
మన దేశం పేరును `ఇండియా` నుంచి `భారత్`కు మార్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే అంశంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. జీ20 సదస్సుకు దేశాధినేతలకు ఆహ్వానాలు పలికిన కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్రపతికి పంపిన ఆహ్వానంలో `ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా` అని కాకుండా `ప్రెసిడెంట్ ఆఫ్ భారత్` అని పంపడమే ఈ అనుమానాలకు కారణమైంది. మెజారిటీ ఓటర్లను ఆకట్టుకోవడం, ప్రతిపక్ష `ఇండియా` కూటమిని దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఇండియా నుంచి భారత్‌కు మన దేశం పేరును మార్చితే అనేక రకాల మార్పులు సంభవించడం తథ్యం. అందులో తమ పేరులో .ఇన్ (.in) కలిపి ఉన్న దేశంలోని వేలాది వెబ్‌సైట్‌లకు ఐడెంటిటీ సమస్యలు రానున్నాయి. అనేక వెబ్‌సైట్‌లు తమ పేర్లలో ఈ డొమైన్‌ను వాడుతుండటమే దీనికి కారణం. సంబంధిత దేశం ఐడెంటిటీ కోసం కంట్రీ కోడ్ టాప్ లేయర్ డొమైన్ (టీఎల్డీ) ను తమ వెబ్‌సైట్‌ల పేరు చివరన పెట్టుకున్నాయి.
తాజాగా ఇండియా నుంచి భారత్‌కు దేశం పేరు మార్చితే .ఇన్ (.in) డొమైన్ `భారత్` అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అప్పుడు భారత్ అనగానే ఠక్కున స్ఫురించేలా కొత్త టీఎల్డీ (డొమైన్)కు మారాల్సి వస్తుంది. అదే చేద్దామన్నా.. మరో చిక్కు సమస్య ఉంది. భారత్ ఇంగ్లిష్ స్పెల్లింగ్ లోని బీహెచ్ లేదా బీఆర్ ఇంగ్లిష్ అక్షరాలతో కొత్త డొమైన్‌ను వాడాలంటే.. వీటిని ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. బీహెచ్‌ని బహ్రెయిన్ దేశానికి, బీఆర్‌ని బ్రెజిల్ దేశానికి, బీటీని భూటాన్ కు కేటాయించారు. దీంతో వెబ్‌సైట్ పేరు చూడగానే ఇది భారత్ అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఒక్కసారిగా డొమైన్ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్‌సైట్‌లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టంగా మారుతుంది.
ప్రస్తుతం దీనికున్న మరో పరిష్కారం ఏంటంటే.. డొమైన్‌లోని అక్షరాలను పెంచుకుని BHARAT, లేదా BHRT అనే కొత్త డొమైన్‌కు మారడం. కొత్త డొమైన్ మారినా.. పాత డొమైన్‌ను కూడా కొనసాగించాలనుకునే సంస్థలకు వీటి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ.. వాటి అసలు వెబ్‌సైట్ ఏమిటనే గందరగోళం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నకిలీ వెబ్‌సైట్‌ల బెడద తలెత్తితే పరిస్థితి దారుణంగా మారుతుంది. దీనికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందనేది వేచిచూడాలి.
*