బీజేపీకి మళ్లీ ఓటేస్తే.. భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్నే కోల్పోతారు.. - మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
పుల్వామా దాడిపై అప్పట్లో ఎలాంటి దర్యాప్తూ జరగలేదని, ఈ ఘటనపై విచారణ జరిగి ఉంటే అప్పటి హోంమంత్రి (రాజ్‌నాథ్ సింగ్) రాజీనామా చేయాల్సి వచ్చేదని ఆయన చెప్పారు.
బీజేపీకి మళ్లీ ఓటేస్తే.. భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్నే కోల్పోతారని జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఓటర్లను హెచ్చరించారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా బన్సూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్ మాలిక్.. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మన సైనికుల శవాలపై జరిగిన పోరాటమని ఆయన మండిపడ్డారు.
ఈ అంశంపై గతంలోనూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన సత్యపాల్ మాలిక్.. మరోసారి అదే విమర్శలు చేశారు. పుల్వామా దాడిపై అప్పట్లో ఎలాంటి దర్యాప్తూ జరగలేదని, ఈ ఘటనపై విచారణ జరిగి ఉంటే అప్పటి హోంమంత్రి (రాజ్‌నాథ్ సింగ్) రాజీనామా చేయాల్సి వచ్చేదని ఆయన చెప్పారు. చాలా మంది అధికారులు జైలు పాలయ్యేవారని తెలిపారు. ఈ వ్యవహారం చాలా వివాదాస్పదం అయ్యేదని వివరించారు.
ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14, 2019న ప్రధానమంత్రి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్‌లో ఉన్నారని గుర్తుచేశారు. ప్రధాని (మోదీ) నేషనల్ పార్కు నుంచి బయటకు రాగానే తాను ఫోన్ చేశానని, మన పొరపాటు కారణంగా మన సైనికులు మరణించారని చెప్పానని వివరించారు. దీంతో ఆయన మౌనంగా ఉండాల్సిందిగా తనకు చెప్పారని వెల్లడించారు.
అలాగే.. వ్యాపారవేత్త అదానీ కేవలం మూడేళ్లలోనే సంపద పోగుచేశారని సత్యపాల్ మాలిక్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన సత్యపాల్ మాలిక్ .. ఒకవేళ మీరు మళ్లీ వారికి ఓటేస్తే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్నే కోల్పోతారని పునరుద్ఘాటించారు.