రీజినల్ రింగ్ రోడ్డుకు వెంటనే అనుమతులివ్వండి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం 159 కి.మీ.లకు అవసరమైన టెక్నికల్, ఎకనామికల్ క్లియరెన్స్‌లు వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి గురువారం గడ్కరీతో భేటీ అయ్యారు. శ్రీశైలంను హైదరాబాద్ తో లింక్ చేసే నేషనల్ హైవే 765లో 125 కి.మీ.ల రోడ్డు నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండగా, 62 కి.మీ.ల రోడ్డు ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉందని, రాబోయే బడ్జెట్‌లో ఆ రోడ్డును ఎలివేటెడ్ కారిడార్‌గా నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ఎన్‌హెచ్ 65ని ఆరు లేన్లుగా అభివృద్ధి చేసే డీపీఆర్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. వరంగల్ నగరం దక్షిణ భాగం బైపాస్ రోడ్డుకు అనుమతులివ్వాలని, తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ ను కలిపే నేషనల్ హైవే వరంగల్ - హన్మకొండ మధ్యలోంచి వెళ్తున్నందన నగరం వెలుపలి నుంచి ఆ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. పర్వత్ మాలా ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి ఆలయం, నల్గొండలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రోప్ వేలు ఏర్పాటు చేయాలని కోరారు.
కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయండి
తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నవోదయ విద్యాలయాలు లేని ఇతర జిల్లాలకు కేటాయించాలని, అలాగే కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా విద్యాసంస్థను డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించాలంటే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని గుర్తు చేశారు. ఈ మధ్య కేంద్రం అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలకు గుర్తింపునిస్తున్నారని, అలా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం వెంట ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, సురేశ్ షెట్కర్, బలరాం నాయక్, కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, రఘురామిరెడ్డి, కడియం కావ్య, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి ఉన్నారు.