డీపీ మారితే దేశభక్తి.. రేట్లు పెరిగితే ఆర్థిక వృద్ధి..

డీపీగా జాతీయ పతాకం పెట్టండని సాక్షాత్తూ ప్రధాని సూచించడమే కలకలం రేపింది. డీపీ మార్చడం సంగతి తర్వాత ముందు ధరలు తగ్గించండి మోదీగారూ అని సలహాలిస్తున్నారు నెటిజన్లు.

Advertisement
Update:2022-08-02 12:35 IST

చాలామంది చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో తమ డిస్‌ప్లే పిక్చర్స్ ని మార్చేస్తుంటారు. ఫాదర్స్ డే రోజున తండ్రి ఫొటో పెట్టుకుంటారు, మదర్స్ డే రోజున తల్లి ఫొటో పెట్టి అభిమానం చాటుకుంటారు. అయితే వీరికి నిజంగా తల్లిదండ్రులపై ప్రేమ ఉందా, వారిని ప్రతిరోజు గౌరవిస్తారా అంటే అనుమానమే. అలాగే జాతీయ జెండా డీపీగా పెట్టుకుంటే దేశభక్తి ఉందనుకోవడం కూడా పొరపాటే. కానీ ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఆజాదీకా అమృత్ మహోత్సవం లో భాగంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో అందరూ తమ డీపీగా జాతీయ జెండా ఫొటో పెట్టాలని సూచించారు. ఇప్పటికే చాలామంది దీన్ని అమలులో పెట్టారు. అలా అమలులో పెట్టనివారిని ఏమనాలి. భక్తుల లెక్కలో వారంతా దేశభక్తి లేనివారనుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది.

దేశభక్తితో పాటు ధరల పెరుగుదల..

ప్రజల్లో దేశ భక్తి ఉంటే సరిపోతుందా, ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉండన‌క్కర్లేదా..? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పకుండా.. డీపీగా జాతీయ పతాకం పెట్టండని సాక్షాత్తూ ప్రధాని సూచించడమే కలకలం రేపింది. డీపీ మార్చడం సంగతి తర్వాత ముందు ధరలు తగ్గించండి మోదీగారూ అని సలహాలిస్తున్నారు నెటిజన్లు.

ప్లేట్లు మోగించడం.. దీపాలు వెలిగించడం..

గతంలో కరోనా సమయంలో కూడా ఇలాగే మోదీ రకరకాల విన్యాసాలు చేయాలని చెప్పారు. చప్పట్లు కొట్టడం, ప్లేట్లు మోగించడం, దీపాలు వెలిగించడం.. దీనివల్ల ఏమవుతుందో ఏమో తెలియదు కానీ, మోదీ చెప్పారు.. భక్తులు పాటించారు అన్నట్టు ఉంది పరిస్థితి. తాజాగా డీపీలు మార్చడంపై కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇది కూడా అలాంటిదేనంటూ మండిపడుతున్నారు కొందరు, వారిని మిగతావారంతా దేశభక్తి లేనివారుగా చిత్రీకరిస్తున్నారు. మదర్స్ డే రోజే అమ్మని గుర్తుంచుకుని, మిగతా రోజుల్లో అన్నం పెట్టని పుత్రరత్నాల్లాగా, ఇండిపెండెన్స్ డే రోజు జెండాని డీపీగా పెట్టుకుని, మిగతా రోజుల్లో ఎవరి పనుల్లో వారు పడిపోవడం సహజంగా జరిగే పరిణామమే. కానీ ప్రధాని స్థాయి వ్యక్తి, ఇలా సోషల్ మీడియాలో దేశభక్తిని పెంపొందేలా చేయాలనుకోవడం కాస్త విడ్డూరమే. సమస్యలను పక్కదారి పట్టించేందుకు, చర్చ సమస్యలపై కాకుండా ఇతర విషయాలపైకి మళ్లించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు నెటిజన్లు.

Tags:    
Advertisement

Similar News