26మంది బాలిక‌లను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు... పరోక్షంగా మనం కూడా కారణం కాదా ?

కేరళ రాష్ట్రం కన్నూరుజిల్లాలోని ఓ ఎయుడెడ్ పాఠాశాలలో పనిచేస్తున్న 52 ఏళ్ళ ఓ ఉపాధ్యాయుడు 2021 నవంబర్ నెల నుంచి విద్యార్థినులను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. కరోనా వల్ల పాఠశాలలు మూసివేసి తిరిగి తెరిచిన తర్వాత ఆ టీచర్ ఈ దుర్మార్గాలు ప్రారంభించాడు.

Advertisement
Update:2023-01-15 15:02 IST

ఒకప్పుడు ఉపాధ్యాయులు సమాజ మార్పు కోసం విద్యార్థులను సిద్దం చేసేవాళ్ళు..అవసరమైతే వాళ్ళు కూడా త్యాగాలు చేసేవాళ్ళు.... భవిష్య‌త్తులో దేశానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయడానికి అనుక్షణం తపించేవాళ్ళు...

విద్యాబుద్దులు నేర్పించి విద్యార్థులను సరైన మార్గంలో నడిపించాల్సిన అలాంటి ఉపాధ్యాయులే తప్పుడు మార్గంలో వెళితే? సమాజ మార్పుకు కీలకమైన ఉపాధ్యాయులు సామాజిక ద్రోహులుగా, కీచకులుగా మారితే ? కేరళలో అలాగే జరిగింది.

ఓ 52 ఏళ్ళ ఉపాధ్యాయుడు 26మంది విద్యార్థునులను లైంగికంగా వేధించాడు. 2021 నవంబర్ నుంచి ఈ విధమైన వేధింపులు జ‌రుగుతున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

కేరళ రాష్ట్రం కన్నూరుజిల్లాలోని ఓ ఎయుడెడ్ పాఠాశాలలో పనిచేస్తున్న 52 ఏళ్ళ ఓ ఉపాధ్యాయుడు 2021 నవంబర్ నెల నుంచి విద్యార్థినులను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. కరోనా వల్ల పాఠశాలలు మూసివేసి తిరిగి తెరిచిన తర్వాత ఆ టీచర్ ఈ దుర్మార్గాలు ప్రారంభించాడు.

విద్యార్థినిలెవ్వరూ బైటికి చెప్పుకోలేకపోవడంతో విషయం బైటికి రాలేదు. చివరకు ఓ విద్యార్థిని ఈ లైంగిక వేధింపుల విషయాన్ని మరో టీచర్ కు చెప్పడంతో ఆ టీచర్ జిల్లా చైల్డ్‌లైన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

జిల్లా చైల్డ్‌లైన్ అధికారుల ఫిర్యాదుల ఆధారంగా ఆ సీనియర్ ఉపాధ్యాయుడిని జనవరి 12న లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని వివిధ నిబంధనల కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

"ఒక విద్యార్థి ఇటీవల తాను ఎదుర్కొన్న వేధింపులను పాఠశాలలోని మరో ఉపాధ్యాయురాలికి వివరించింది. ఆమె వెంటనే చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం అందించింది. వారు మాకు సమాచారం అందించారు. జనవరి 11న మాకు ఫిర్యాదు అందింది" అని పోలీసులు తెలిపారు.

తదుపరి విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఆ ఉపాధ్యాడిపై ఫిర్యాదులు చేశారని చైల్డ్‌లైన్ అధికారి తెలిపారు.

''జనవరి 12న ఐదు కేసులు నమోదు చేసి ఆ ఉపాధ్యాడిని అరెస్ట్ చేశాం.. ఆ తర్వాత నిన్న 21 కేసులు నమోదు చేశాం.. జ్యుడీషియల్ కస్టడీకి తరలించాం'' అని పోలీసులు తెలిపారు.

ఉపాధ్యాడిని అరెస్టు చేశారు.... కేసు నడుస్తుంది... రేపో మాపో ఆయన బెయిల్ పై బైటికి వస్తాడు. కానీ సంవత్సరం పైగా లైంగిక వేధింపులు అనుభవించిన ఆ చిన్నారుల మానసిక పరిస్థితి ఏలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి ! లైంగిక వేధింపులు జరగ్గానే బైటికి చెప్పుకోలేని దుస్థితి ఈ సమాజంలో ఇంకా ఎంత కాలం? ఒక్క సారి ఆలోచించండి. ఒక వేళ ఆ పరిస్థితే ఈ సమాజం కల్పిస్తే ఒకరిపై లైంగిక వేధింపులు జరగ్గానే ఆ ఉపధ్యాయుడు అరెస్టయ్యేవాడు కాదా ? మరి ఇంత మంది బలవ్వడానికి ఆ ఉపాధ్యాయుడితోపాటు మనం కూడా కారణం కాదా ?

Tags:    
Advertisement

Similar News