ఆంధ్ర, తెలంగాణ మధ్య భూముల పంచాయితీ!

ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కుంటున్నారని' చంద్రబాబు చెప్తున్నారని కేసీఆర్‌ గుర్తుచేశారు. సరైన నాయకత్వం ఉంటే మంచి అభివృద్ధి జరుగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

Advertisement
Update:2023-06-23 09:28 IST

తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు భూముల పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అభివృద్ధికి నిదర్శనంగా పెరిగిన భూముల ధరలను చూపుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రులు. పటాన్‌చెరు మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు శంకుస్థాపన సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తప్పుబట్టారు.

తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఎదిగిందన్నారు సీఎం కేసీఆర్‌. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణలో భూముల ధరలు పెరిగాయన్నారు. తెలంగాణ రావొద్దన్న చంద్రబాబే ఆ విషయాన్ని చెప్పారన్నారు. 'ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో 5 ఎకరాలు కొనేవాళ్లం.. ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కుంటున్నారని' చంద్రబాబు చెప్తున్నారని కేసీఆర్‌ గుర్తుచేశారు. సరైన నాయకత్వం ఉంటే మంచి అభివృద్ధి జరుగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పందించారు. గతంలో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ వైపు చూడని సంస్థలు ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. అయినా రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసేలా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు. కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులను రాబట్టడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు గుడివాడ.

కేసీఆర్‌ భూముల గురించి ఎందుకు మాట్లాడారో తెలియదంటూనే.. విశాఖలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌లో మాత్రమే భూములకు ధర ఉందన్నారు మంత్రి అమర్నాథ్‌. చంద్రబాబు చెప్పిన విషయాలను చెబితే చివరకు కేసీఆర్‌ మాటలు కూడా జనం నమ్మరని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News