అర్జెంటీనాలో శృతి మించిన సంబరాలు.. ఆటగాళ్లను హెలికాప్టర్‌లో తరలించిన ప్రభుత్వం
అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పడుతుండగా ఓపెన్ టాప్ బస్సులో మెస్సి బృందం కూడా రాక్‌బ్యాండ్‌తో శ్రుతి కలిపి ముందుకు సాగింది.
ఇసుకేస్తే రాలనంత జనం అంటే ఎప్పుడైనా చూశారా? నిన్న అర్జెంటీనా రాజధానిలో వరల్డ్ కప్ గెలిచిన తమ అభిమాన సాకర్ జట్టును, మెస్సీని అభినందించడానికి వచ్చిన అభిమానులను చూస్తే అర్థం అవుతోంది. ఎక్కడ చూసినా చీమల పుట్టలు పగిలినట్లుగా.. నేల ఈనిందా అన్నట్లుగా, ఒక్క సెంటీమీటర్ ఖాళీ నేల కూడా కనపడనంత జనాలు వచ్చారు. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంతో మంగళవారం జాతీయ సెలవు దినంగా దేశాధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ప్రకటించారు. ఖతర్ నుంచి అర్జెంటీనా చేరుకున్న మెస్సీ జట్టును చూడటానికి దాదాపు 50 లక్షల మంది బ్యూనస్ఎయిర్ వచ్చారు. రోడ్ల వెంట భారీ సంఖ్యలో తమ అభిమాన ఆటగాళ్లను చూడటానికి బారులు తీరారు.
ఇజీజా విమానాశ్రయం నుంచి ఫుట్‌బాల్ సంఘం ప్రధాన కార్యాలయం వరకు ఈ పరేడ్ జరగాల్సి ఉంది. ఆటగాళ్లందరూ ఓపెన్ టాప్ బస్సులో బయలుదేరారు. లక్షలాది మంది అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతుండగా.. బస్సు రోడ్ల వెంట పరుగులు తీసింది. వారి రాకతో నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఒకవైపు తమ జట్టును కీర్తిస్తూ రాక్‌బ్యాండ్ పాటలు, మరోవైపు 'థాంక్యూ ఛాంపియన్స్' అనే ప్లకార్డులతో ఎటు చూసినా అర్జెంటీనా జపమే.
అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పడుతుండగా ఓపెన్ టాప్ బస్సులో మెస్సి బృందం కూడా రాక్‌బ్యాండ్‌తో శ్రుతి కలిపి ముందుకు సాగింది. అయితే మార్గమధ్యంలోకి వచ్చే సరికి అభిమానుల ఆనందం శృతి మించింది. మెస్సీతో పాటు రోడ్రిగో డి పాల్, నికోలస్, లియాండ్రో పరేడ్స్, డి మారియా వెళ్తున్న బస్సు టాప్‌లోకి బ్రిడ్జిపై నుంచి కొందరు అభిమానులు దూకడానికి ప్రయత్నించారు. ఒక వ్యక్తి బస్సులో పడినా.. ఇంకో వ్యక్తి మాత్రం రోడ్డుపై పడిపోయాడు.అంతకు ముందు ఆటగాళ్ల బస్సుపైకి విద్యుత్ వైరు అడ్డొచ్చింది. ఓ ఆటగాడి క్యాప్ కూడా వైర్ తాకి పడిపోయింది.
ఇంకొంచెం ముందుకు వెళ్లాక కొంత మంది బస్సులోకి ఎక్కే ప్రయత్నం చేశారు. బస్సును కదలకుండా నిలిపివేశారు. దీంతో ఆటగాళ్ల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని గ్రహించి ప్రభుత్వం వెంటనే హెలీకాప్టర్‌ను పంపించింది. ఆటగాళ్లను సురక్షితంగా సాకర్ కేంద్ర కార్యాలయానికి తరలించింది. పరేడ్‌ను పూర్తి చేయనందుకు అభిమానులకు ఆ దేశ ఫుట్‌బాల్ సంఘం క్షమాపణలు చెప్పింది. అభిమానులు కూడా పూర్తిగా సహకరించి ఉండాల్సిందని కోరింది.