ట్విట్టర్ షట్ డౌన్ అవుతుందా? ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో #RIPTwitter

"#RIPTwitter" అనే హ్యాష్‌ట్యాగ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్‌లో న‌డుస్తోంది. 'హార్డ్‌కోర్' ట్విట్ట‌ర్ ఉద్యోగులు కంపెనీని విడిచిపోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Update:2022-11-19 20:42 IST

ట్విట్టర్, టెస్లా సీఈఓ, బిలియ‌నీర్ ఎలోన్ మస్క్ చేతుల్లోకి వెళ్ళినప్పటి నుండి ఆయన వార్తల్లో ప్ర‌ముఖంగా నిలుస్తున్నారు. మస్క్ కంపెనీని స్వాధీనం చేసుకున్న తర్వాత, పరాగ్ అగర్వాల్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా అనేక మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. మ‌స్క్ చ‌ర్య‌ల‌ను విమ‌ర్శిస్తూ చేసిన ట్వీట్ల‌ను రీట్వీట్ చేసిన కార‌ణంగానే త‌మ‌ను తొల‌గించారంటూ ఉద్వాస‌న‌కు గురైన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త హ్యాష్‌ట్యాగ్ "#RIPTwitter" అంటూ ట్విట్టర్ లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో న‌డుస్తోంది. 'హార్డ్‌కోర్' ట్విట్ట‌ర్ ఉద్యోగులు కంపెనీని విడిచిపోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప‌రిణామాలు మైక్రోబ్లాగింగ్ సైట్ చ‌రిత్ర ముగింపును సూచిస్తోంద‌నే వ్యాఖ్య‌లు విన‌బ‌డుతున్నాయి. పెద్ద సంఖ్య‌లో కీల‌క‌మైన ఇంజ‌నీరింగ్ సిబ్బంది స‌హా ఉద్యోగులు కంపెనీనుంచి వెళ్ళిపోవ‌డంతో ఎలోన్ మ‌స్క్ తో పాటు అతి తక్కువ సంఖ్యలో ఇంజనీర్లు, ఉద్యోగులు మాత్రమే మిగిలి ఉన్నారు.

అత్యంత హార్డ్‌కోర్ ట్విట్టర్ విధానాల‌ను అంగీకరించిన‌వారే కంపెనీలో ప‌నిచేయాలంటూ మ‌స్క్ అల్టిమేటం జారీ చేసిన విష‌యం తెలిసిందే. పైగా వారి తిండి ఖ‌ర్చులే ఎక్కువ‌వుతున్నాయ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించ‌డం ఉద్యోగుల‌ను బాధించింది. కంపెనీ చెప్పిన‌ట్టు ఒత్తిడిలో అధిక గంట‌లు ప‌నిచేసేందుకు ఆమోదించ‌ని అధిక శాతం ఉద్యోగులు మ‌స్క్ ఆదేశాల‌ను పాటించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని విధుల‌కు దూర‌మ‌య్యారు.

కంపెనీ నిర్వ‌హ‌ణ‌లో అత్యంత కీల‌క విభాగాల‌ను నిర్వ‌ర్తిస్తున్న సీనియ‌ర్ ఇంజ‌నీర్ల‌తో పాటు క‌మ్యూనికేష‌న్ విభాగం నుంచి కూడా ఉద్యోగ బృందాలు కంపెనీని విడిచిపెట్ట‌డంతో ఇక ట్విట్ట‌ర్ మ‌నుగ‌డ ముగిసిపోయిన‌ట్టేన‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. రాజీనామాలను ప్రకటించిన ట్విట్టర్ ఉద్యోగుల గ్రూపులు "#RIPTwitter" ట్రెండ్‌ను ప్రారంభించినట్లు భావిస్తున్నారు. ఈ విష‌యం తెలిసిన‌ తర్వాత మరింత మంది ఈ గ్రూప్ ల తో చేరారు.


Tags:    
Advertisement

Similar News