కెనడాలో కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల పోరాటం...కుల సమానత్వం కోసం తీర్మానం చేసిన టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్
అమెరికా పక్కనే ఉన్న కెనడాలో కూడా అవే పరిస్థితులున్నాయి. ఎంతో కాలంగా దళితుల పట్ల సాగుతున్న వివక్ష పై దక్షిణాసియా దళిత ఆదివాసీ నెట్‌వర్క్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ (TDSB) కుల సమానత్వం కోసం తీర్మానాన్ని ఆమోదించింది.
భారతీయులు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తమ కులగజ్జిని కూడా వెంట తీసుకెళ్తారా ? అగ్రకులాలు తమ ఆదిపత్య అహంకారాన్ని వేరే దేశాల్లో కూడా ప్రదర్శిస్తారా ? అవును...ఇది ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు.ఒక్క మనదేశంలోనే కాకుండా భారతీయులున్న ప్రతీ దేశంలో కులం ఒక అణిచివేత సాధనంగా అగ్రకులాల చేతుల్లో ఉపయోగపడుతోంది.
మొన్నటికి మొన్న అమెరికాలోని సియాటిల్ నగరం మున్సిపాలిటీ కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానం చేసింది. అమెరికాలో హిందువుల్లోని అగ్రకులాల వాళ్ళు దళితుల పట్ల వ్యవహరించే విధానం చాలా దారణంగా ఉంటుందని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అనేక స్వచ్చంద సంస్థలు ఆ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
అమెరికా పక్కనే ఉన్న కెనడాలో కూడా అవే పరిస్థితులున్నాయి. ఎంతో కాలంగా దళితుల పట్ల సాగుతున్న వివక్ష పై దక్షిణాసియా దళిత ఆదివాసీ నెట్‌వర్క్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ (TDSB) కుల సమానత్వం కోసం తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై త్రినా కుమార్ అనే విద్యార్థి మాట్లాడుతూ,
''నా పేరు త్రినా కుమార్, నేను కాలేజీ విద్యార్థిని, కెనడాకు చెందిన దక్షిణాసియా దళిత ఆదివాసీ నెట్‌వర్క్ సభ్యుడిని. టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ (TDSB) కుల సమానత్వం కోసం శక్తివంతమైన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా చరిత్ర సృష్టించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కుల-అణచివేతకు గురైన ట్రస్టీ యాలిని రాజకులసింగం ద్వారా ఈ నెట్ వర్క్ నాకు పరిచయం అయ్యింది. ఇది టొరంటో పాఠశాలల్లో నాలాంటి కుల-అణచివేతకు గురైన పిల్లల బాధలను పట్టించుకుంటుంది.
ఈ తీర్మానంతో కెనడియన్ శాసన చరిత్రలో మొదటిసారిగా కుల వివక్ష ఉందని అంగీకరించినట్టైంది. ఇప్పుడు TDSB, దళిత కుటుంబాలు, అంటారియో ప్రావిన్స్ హ్యూమన్ రైట్స్ కమీషన్‌తో కలిసి టొరంటో పాఠశాలల్లో కుల వివక్షపై పోరాడుతుంది.
గ్రేటర్ టొరంటో పాఠశాలల్లో నేను చాలా కుల బెదిరింపులను ఎదుర్కొన్నాను. ప్రజలు నా రంగు గురించి వ్యాఖ్యలు చేసారు. నేను వారి అగ్ర కులాల ఆచారాలను పాటించనందున నేను నల్లగా ఉన్నానని, దళిత క్రిస్టియన్ అని నన్ను ఎగతాళి చేసారు. ఈ బెదిరింపులు నన్ను గందరగోళంలో పడేశాయి. అందరం కెనడియన్లమైనప్పుడు తోటి క్లాస్‌మేట్‌లకు ఎందుకు కులం అంత ముఖ్యమైనది అని నేను ఆశ్చర్యపోయాను. కానీ సమస్య ఏమిటంటే, వారు తమ ఆధిపత్య కులాల ఇళ్లలో అణచివేత నేర్చుకుంటున్నారు. మా కుటుంబంలో మేము గదిలో దాక్కుని బతకాల్సిన పరిస్థితి. నేను దీన్ని నిజంగా అసహ్యించుకున్నాను.
నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను! నేను ఇప్పుడు దళితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాను.
కాలేజీలో దళిత యువకుడిగా ఉన్న నాకు భవిష్యత్తు నాదేనని తెలుసు. నేను కులాల కారణంగా వేధింపులకు గురయిన అనేక నా అనుభవాలు, నేను పడిన కష్టాలు మరెవరూ పడకుండా చూసుకోవడానికి మా నెట్ వర్క్ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాము.
ఇది ఆధిపత్య కులాల ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తుంది. కానీ ఈ పోరాటం తప్పదు. ఇప్పటికైనా వారి కులతత్వాన్ని వదిలేసి వారి పిల్లలను కులాతీతంగా పెంచడం నేర్చుకోవాలి. దానివల్ల వారు నాలాంటి దళిత కుటుంబాలతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు.
నేను ఆశాజనకంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము అంటారియో హ్యూమన్ రైట్స్ కమీషన్‌తో కలిసి పని చేస్తున్నాము. మేము టొరంటో పిల్లలకు మాత్రమే కాకుండా ప్రావిన్స్‌లోని అన్ని దక్షిణాసియా కుటుంబాల్లో మార్పును తీసుకురాగలము. ఇక నాలాంటి కుటుంబాలకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది కుల సమానత్వ ఉద్యమంతో పాటుగా నిలబడినందుకు TDSBకి నేను కృతజ్ఞుడను.'' అని త్రినా కుమార్ చెప్పారు.