హసన్ నస్రల్లా వారసుడు ఎవరు?
ఇజ్రాయెల్ దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా వెల్లడి. ఆ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ.
హెజ్‌బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నది. ఈ క్రమంలోనే హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించిన విషయం విదితమే. దీనిపై హెజ్‌బొల్లా కూడా స్పందించింది. ఈ దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా వెల్లడించింది. ఇజ్రాయెల్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది.
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మా నాయకుడు సన్రల్లా మృతి చెందారు. అయితే దీనికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. పాలస్తీనాకు మద్దతుగా నిలువడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తామని హెజ్‌బొల్లా బృందం ప్రకటించింది. అయితే నస్రల్లా చనిపోతే హెజ్‌బొల్లా పూర్తిగా నిర్వీర్యం కాదు. కానీ సభ్యుల సామర్థ్యానికి ఇది భారీ ఎదురుదెబ్బే అని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు లెబనాన్ ప్రభుత్వంలో నస్రల్లా ఎలాంటి పదవులు చేపట్టనప్పటికీ ఆ దేశ విధానాల రూపకల్పనలో అతనిది కీలక పాత్ర. అలా తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన వారసుడు ఎవరు అనే చర్చ ప్రారంభమైంది.
ఇజ్రాయెల్‌పై పోరాడే విషయంలో ఇరాన్, హెజ్‌బొల్లా కలిసే ముందుకు వెళ్తున్నాయి. దీంతో తదుపరి అధిపతిగా ఈ రెండు వర్గాల ఆమోదం ఉన్నవ్యక్తే ఉంటారని సమాచారం. ఆ గ్రూప్ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా ప్రకటించే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అతను హెజ్‌బొల్లాకు చెందిన జిహాద్ కౌన్సిల్ సభ్యుడే కాదు, నస్రల్లా బంధువు కూడా. తన తర్వాత నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికే నస్రల్లా అతడిని తీర్చిదిద్దినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అలాగే ఇద్దరిలోనూ పోలికలు ఉంటాయట. సఫీద్దీన్‌ను 2017లో అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది.
నస్రల్లా ఆచూకీ గురించి ఇజ్రాయెల్‌కు ముందే తెలుసట!
హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఎక్కడ ఉన్నాడో కొన్ని నెలల ముందే ఇజ్రాయెల్‌కు తెలుసని ఆ దేశ రక్షణ వర్గాలు ఓ వార్తా సంస్థకు వెల్లడించాయి. అతను వేరే ప్రాంతానికి పారిపోయి తప్పించుకోకముందే దాడి చేయాలని గత వారమే నిర్ణయించినట్లు తెలిపాయి. నస్రల్లా ఉన్న ప్రదేశంలో నిమిషాల వ్యవధిలో 80కి పైగా బాంబులు జార విడిచినట్లు సమాచారం.