అభ్యర్థిని నేనే.. గెలిచేది మేమే.. - స్పష్టం చేసిన జో బైడెన్‌

2020లోలాగే ట్రంప్‌ని ఇప్పుడు కమలా హ్యారిస్‌తో కలిసి తాను ఓడించబోతున్నానని బైడెన్‌ తెలిపారు. అయితే అది అంత సులభం కాదని, అందుకు మీ మద్దతు కావాలని కోరారు.

Advertisement
Update:2024-07-04 14:53 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో తానే ఉంటానని, గెలిచేది కూడా తామేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. గత వారం రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో జరిగిన సంవాదంలో బైడెన్‌ తడబడిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన గెలుపుపై స్వపక్షంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ని తప్పించాలని కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. వీటికి బదులుగానే బైడెన్‌ తాజాగా స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని, పోటీ నుంచి వైదొలగాలని తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని తెలిపారు.

ఈ సందర్భంగా తన మద్దతుదారులకు రాసిన లేఖలో మనమే గెలవబోతున్నాం. ట్రంప్‌ను ఓడించేందుకు మాకు అండగా నిలవండి అని కోరారు. విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. జీవితంలో తాను చాలాసార్లు కింద పడ్డానని, మళ్లీ పైకి లేచి పోరాడానని ఈ సందర్భంగా బైడెన్‌ పేర్కొన్నారు. ఎన్నిసార్లు పడిపోయావన్నది కాదు.. ఎంత వేగంగా కోలుకున్నావనేదే ముఖ్యమని తన తండ్రి చెబుతుండేవారని ఆయన వివరించారు. అమెరికా సైతం.. వెనుకబడిన ప్రతిసారీ బలంగా పుంజుకొని తానేంటో నిరూపించుకుందని ఆయన తెలిపారు. తానూ అదే చేయబోతున్నానని పేర్కొన్నారు. 2020లోలాగే ట్రంప్‌ని ఇప్పుడు కమలా హ్యారిస్‌తో కలిసి తాను ఓడించబోతున్నానని బైడెన్‌ తెలిపారు. అయితే అది అంత సులభం కాదని, అందుకు మీ మద్దతు కావాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News