ఇరాన్‌ అణు, చమురు స్థావరాలపై దాడి చేయం

తమ గురి కేవలం ఆ దేశ మిలటరీపైనేనని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చెప్పినట్లు పత్రికల్లో కథనాలు

Advertisement
Update:2024-10-15 10:49 IST

ఇరాన్‌ అణు, చమురు స్థావరాలపై దాడి చేయబోమని, తమ గురి కేవలం ఆ దేశ మిలటరీపైనేనని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చెప్పినట్లు పత్రికల్లో కథనాలు వెల్లడించాయి. కొన్నిరోజుల కిందట ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ చేసిన క్షిపణుల దాడికి ప్రతిస్పందనగా ఇరు దేశాల నేతల మధ్య సంభాషణ జరిగింది. అమెరికా ఎన్నికలపై ప్రభావం చూపకుండానే తమ దాడి కొనసాగుతుందని ఓ అధికారి చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. చమురు ధరలు పెరిగితే ఓటర్లు అసహనానికి గురవుతారని, కమాలాహారీస్‌ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అలాంటి చర్యలకు ఇజ్రాయెల్‌ పాల్పడదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మేము అమెరికన్‌ ప్రభుత్వ ఆలోచనలు వింటామని అదేసమయంలో ఇజ్రాయెల్‌ దళాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం పేర్కొన్నది. నెతన్యాహుకు యూఎస్‌ విజ్ఞప్తులు ఇజ్రాయెల్‌లోని ప్రజల డిమాండ్‌తో సమానమని ఆ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్‌ మాజీ డైరెక్టర్‌ పేర్కొన్నారు. అలాగే యూఎస్‌ ఆయుధాలతోనే ఇజ్రాయెల్‌ పోరాడుతుందని స్పష్టం చేశారు. అయితే ఈ అంశాలపై వైట్‌హౌస్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇటీవల ఇరాన్‌ సుమారు 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు చెందిన అణు, చమురు స్థావరాలను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేయడానికి చర్చలు జరుపుతున్నదనే కథనాలు వెలువడాయి. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇరాన్‌ అణుస్థావరాలపై కాకుండా ప్రత్యామ్నాయంగా దాడి చేయాలని బహిరంగంగానే ఇజ్రాయెల్‌కు సూచించారు.

Tags:    
Advertisement

Similar News