అతడు నగర వీధుల్లో నగ్నంగా తిరగొచ్చు.. సంచలనంగా మారిన కోర్టు తీర్పు

స్పెయిన్ లోని అల్డయాకు చెందిన 29 ఏళ్ల అలెజాండ్రో కొలోమార్ కు చిన్నప్పటి నుంచి స్పెయిన్ లోని న్యూడిస్ట్ బీచ్ లకు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ బీచ్ లో అతడు నగ్నంగా తిరిగేవాడు.

Advertisement
Update:2023-02-08 13:21 IST

అసలు నగ్నంగా ఎవరైనా బయట తిరుగుతారా..? అనే ప్రశ్న వస్తే ఏ దేశంలో అయినా, ఫాస్ట్ కల్చర్ ఉన్న దేశాల్లో అయినా ఎవరూ నగ్నంగా బయటతిరగరనే సమాధానమే వస్తుంది. అలా ఎవరైనా తిరుగుతున్నారంటే వాళ్లు మ‌తిస్థిమితం లేనివారు మాత్రమే. అలాంటివారు బయట నగ్నంగా తిరిగినా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా బరి తెగించి దుస్తులు లేకుండా తిరుగుతుంటే మాత్రం విషయం పోలీసుల వరకు వెళుతుంది.

అయితే స్పెయిన్ కు చెందిన ఓ వ్యక్తికి నగర వీధుల్లో నగ్నంగా తిరిగే అలవాటు ఉంది. అతడు అలా దుస్తులు లేకుండా తిరగడంపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. అయితే కోర్టు అతడు నగ్నంగా తిరిగేందుకు అనుమతి ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది.

స్పెయిన్ లోని అల్డయాకు చెందిన 29 ఏళ్ల అలెజాండ్రో కొలోమార్ కు చిన్నప్పటి నుంచి స్పెయిన్ లోని న్యూడిస్ట్ బీచ్ లకు వెళ్లే అలవాటు ఉంది. అక్కడ బీచ్ లో అతడు నగ్నంగా తిరిగేవాడు. అయితే ప్రస్తుతం 29 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ అలెజాండ్రో దుస్తులు లేకుండా బయట తిరిగేందుకు ఇష్టపడుతున్నాడు. అయితే అలెజాండ్రో మొదటిసారి 2020లో బీచ్ లో కాకుండా స్పెయిన్ లోని వాలెన్సియా నగర వీధుల్లో నగ్నంగా తిరిగాడు. 1988లో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్పెయిన్ లోని చాలా ప్రాంతాల్లో దుస్తులు లేకుండా తిరగడం నేరం కాదు. అందుకే వాలెన్సియా నగర వీధుల్లో అలెజాండ్రో నగ్నంగా తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు.

అలెజాండ్రో స్వస్థలం అయిన అల్డయాలో మాత్రం నిబంధనలు వేరుగా ఉన్నాయి. అల్డయాలో కూడా దుస్తులు లేకుండా తిరగడం ప్రారంభించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. వాలెన్సియాలోని స్పానిష్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అలెజాండ్రో చిన్నప్పట్నుంచి తనకు ఉన్న అలవాటు గురించి కోర్టుకు వివరించాడు. స్పెయిన్ లోని చాలా ప్రాంతాల్లో బహిరంగ నగ్నత్వం అన్నది నేరం కాదన్న విషయాన్ని ప్రస్తావించాడు.

తాను అన్ని ప్రాంతాల్లో నగ్నంగా తిరగనని.. అల్డయాలోని రెండు నగర వీధుల్లో మాత్రమే తిరుగుతుంటానని కోర్టుకు వివరించాడు. తన చర్యల వల్ల ఇప్పటివరకు ఎవరికీ ఇబ్బందులు కలగలేదని కోర్టు దృష్టికి తెచ్చాడు. తాను అల్డయాలో దుస్తులు లేకుండా తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని అలెజాండ్రో కోర్టును కోరాడు. కోర్టు అలెజాండ్రో నగ్నంగా తిరిగేందుకు అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. నగ్నంగా తిరిగేందుకు కూడా అనుమతి ఇస్తారా.. అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కాగా అలెజాండ్రో రోడ్లపై తిరిగే సమయంలో కొన్ని నిబంధనలు పాటించనందుకు కోర్టు కొంత మేర జరిమానా విధించింది. విచిత్రం ఏమిటంటే.. ఈ కేసుకు సంబంధించి స్పానిష్ కోర్టు విచారణ జరిపే సమయంలో అలెజాండ్రో కోర్టుకు నగ్నంగా హాజరయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అధికారులు మాత్రం అతడు దుస్తులు ధరించిన తర్వాతే కోర్టులోకి రానివ్వడం కొసమెరుపు.

Tags:    
Advertisement

Similar News