అమెరికా గగనతలంలో మరో నిఘా బెలూన్ - బైడెన్ ఆదేశాల మేరకు కూల్చివేత
పౌర విమాన రాకపోకలకు కాస్తంత విఘాతం కలిగించేదిగా ఉన్న వస్తువును కూల్చేశామని, శిథిలాలను వెతికే పనిలో ఉన్నామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు.
అగ్రరాజ్యం అమెరికా గగనతలంపై మరో ఉల్లంఘన ఉదంతం చోటుచేసుకుంది. చైనాకు చెందిన భారీ నిఘా బెలూన్‌ను ఇటీవలే కూల్చేసిన విషయం తెలిసిందే. ఇంతలోనే కారు పరిమాణంలో ఉండి. అలాస్కాలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న మరో బెలూన్‌ను అక్కడి రక్షణ అధికారులు గుర్తించారు. పౌర విమాన రాకపోకలకు కాస్తంత విఘాతం కలిగించేదిగా ఉన్న వస్తువును కూల్చేశామని, శిథిలాలను వెతికే పనిలో ఉన్నామని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జనరల్ ప్యాట్ రైడర్ వెల్లడించారు.
ఈ వస్తువు 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్టు గుర్తించామని, 24 గంటలపాటు నిశితంగా పరిశీలించిన తర్వాత యుద్ధ విమానాలతో కూల్చేశామని అమెరికా జాతీయ భద్రతా మండలి కోఆర్డినేటర్ జాన్ కిర్బీ మీడియాకు వెల్లడించారు. దాని శకలాలు గడ్డ కట్టిన అమెరికా సముద్ర జలాల్లో పడ్డాయని తెలిపారు.
ఇటీవల కూల్చేసిన చైనా నిఘా బెలూన్‌కు స్వయం నియంత్రణ, గమన వ్యవస్థ ఉన్నాయని ఈ సందర్భంగా జాన్ కిర్బీ తెలిపారు. సున్నిత సైనిక స్థావరాలపై అది నిఘా పెట్టిందని చెప్పారు. కానీ ఇప్పుడు గుర్తించిన వస్తువు ఏం చేసిందనేది ఇంకా తెలియదని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ఇప్పుడు చైనా ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.