ఏడాదిలో 777 సినిమాలు చూసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన అమెరికన్
ఇంతకు మందు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్ ఏడాదిలో 715 సినిమాలు చూసి సృష్టించిన రికార్డును స్వోప్ తిరగరాశాడు.
ఏడాదికి థియేటర్లలో ఎన్ని సినిమాలు చూస్తారు.. మహా అయితే ఓ 15, 20.. మరీ సినిమా ప్రేమికులైతే 50 నుంచి 100. కానీ అమెరికాలో ఓ వ్యక్తి ఏడాది కాలంలో ఏకంగా 777 సినిమాలు చూశాడు. అదీ థియేటర్లలోనే. అలా ప్రపంచ రికార్డు సృష్టించిన ఆ అమెరికన్ పేరు జాక్ స్వోప్. ఇంతకు మందు ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్ ఏడాదిలో 715 సినిమాలు చూసి సృష్టించిన రికార్డును స్వోప్ తిరగరాశాడు.
రోజూ కనీసం 3 సినిమాలు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్యోగానికి వెళ్లే స్వోప్ వీలు కుదిరినప్పుడల్లా సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేవాడు. అలా రోజూ 3 సినిమాలు చూశానని, సెలవు రోజుల్లో ఐదారు సినిమాలు ఒకే రోజు చూశానని కూడా చెప్పుకొచ్చాడు. అలా 2022 మే నుంచి ఈ ఏడాది మే వరకు ఏడాది కాలంలో ఏకంగా 777 సినిమాలు చూశాడు. అంతే కాదండోయ్.. సినిమా చూసేటప్పుడు ఫోన్ చూడటం, తినడం, తాగడం, నిద్రపోవడం వంటి పనులేమీ చేయకుండా కేవలం సినిమా మీదే కాన్‌సన్‌ట్రేట్ చేశాడట. ఇవన్నీ పక్కాగా చేశాడనుకుని నిర్ధారించుకున్నాక గిన్నిస్ బుక్ అతనికి ఏడాది కాలంలో అత్యధిక సినిమాలు థియేటర్లలో చూసిన వ్యక్తిగా రికార్డు ఇచ్చింది.
ఆటిజంపై అవగాహన కోసమే అంటున్న స్వోప్
తాను కొన్నాళ్లపాటు ఆటిజంంతో బాధపడ్డానని, ఒకానొక దశలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని జాక్ చెప్పాడు. ఈ నేపథ్యంలో సినిమాలు చూసి, రికార్డు సాధించాలని దృష్టి పెట్టానని, తద్వారా తన రుగ్మతను చాలా వరకు తగ్గించుకోగలిగానని అన్నాడు. ఆటిజంపై అవగాహన కోసమే తాను సినిమాలపై దండయాత్ర చేశానన్నాడు. దీన్ని గుర్తించిన అమెరికాలోని ఆత్మహత్యల నివారణ సంస్థ అతనికి 6 లక్షల రూపాయల బహుమతి కూడా ఇచ్చిందట!
♦