క‌డుపులో ఈగ‌..

పరీక్ష చేయించుకునేందుకు వెళ్లిన వృద్ధుడి పెద్ద పేగులో ఈగ ఉండటం.. అది ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

Advertisement
Update:2023-11-24 21:10 IST

అనగనగా ఒక ఈగ.. ఇల్లు అలుకుతూ తన పేరు మరచిపోయిన కథ‌ మనం వినే ఉంటాం.. కానీ, ఈ వార్త అలా కాదు.. ఈగ కథే కానీ, ఈ ఈగ అడ్రసే మరచిపోయింది. అమెరికాలోని మిస్సోరీకి చెందిన వ్యక్తి పేగులో ఓ ఈగ దూరింది. అది చూసి వైద్యులు షాక్ అయ్యారు. 63 ఏళ్ల వ్యక్తి తన పెద్ద పేగు క్యాన్సర్‌కు సంబంధించిన సాధారణ చెకప్ కోసం ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ప‌త్రికి వెళ్లాడు. ఈ పరీక్షా విధానంలో పేగుల లోపల కెమెరాను ఉంచారు వైద్యులు. అంతా బాగానే ఉందని అనుకుంటుండగానే అసాధారణమైన విషయం వైద్యుల కంట పడింది. ఆ వ్యక్తి పేగుల గోడపై ఒక ఈగ ఉంది. అది బ‌తికే ఉంది.




కొలొనోస్కోపీ అనేది కొలొరెక్టల్ వ్యాధులను ముందస్తుగా గుర్తించి, నివారించడానికి ఉపయోగించే విధానం. ఈ ప్రక్రియలో ఓ ఫ్లెక్సిబుల్ ట్యూబ్‌కు చిన్న కెమెరా, లైట్ అమర్చి పెద్ద పేగులోకి పంపించి పరీక్షిస్తారు. ఈ పరీక్ష చేయించుకునేందుకు వెళ్లిన వృద్ధుడి పెద్ద పేగులో ఈగ ఉండటం.. అది ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పగా అతను కూడా షాక్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కొలొనోస్కోపీ చేయించుకోటానికి ముందు ఎటువంటి ఆహారం తిన్నాడు..? తిని ఎంత సేపు అయ్యింది..? అనే విషయాలను ఆరా తీశారు. అప్పటి వరకు లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకున్నానని, ముందు రోజు మాత్రంగా ఆకుకూర, ఇంకా పిజ్జా తిన్నానని తెలిపాడు. వీటి ద్వారానే ఆ ఈగ పెద్దపేగులోకి ప్ర‌వేశించిన‌ట్లుగా మిస్సౌరీ విశ్వవిద్యాలయ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్ట్ విభాగం నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో రాశారు.




ఈగలు చాలా అరుదుగా పండ్లు, కూరగాయలలో గుడ్లు పెడతాయి. అలాంటి లార్వాలను తిన్నప్పుడు ఇవి కడుపులోని ఆమ్లాన్ని తట్టుకుని పేగులలో పొదుగబడే అవకాశం ఉంది. దీనిని పేగు మయాసిస్ అని పిలుస్తారు. ఈగలు, వాటి లార్వాలు, పరాన్నజీవులు పేగులను ప్రభావితం చేసిన సందర్భాలు గతంలో జరిగినప్పటికీ ..పేగులో జీర్ణం కాని ఈగను గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి.

Tags:    
Advertisement

Similar News