ఇక చికెన్ కూడా పండిస్తారు.. - కోడి లేకుండానే మాంసం.. అదీ బోన్‌లెస్‌గా..
ఇది సెల్ కల్చర్డ్ చికెన్. ప్రతి 18–24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం (సెల్ కల్చర్డ్ చికెన్) ఉత్పత్తి చేస్తారు. జంతు కణాల నుంచి ఉత్పత్తి చేసే ఈ సెల్ కల్చర్డ్ చికెన్ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.
ఆహార పదార్థాల చరిత్రలో ఇదొక విప్లవాత్మక పరిణామం.. కోడిని కోయకుండానే.. రక్తం చిందకుండానే.. కోడి మాంసం అందుబాటులోకి వస్తుంది.. అదీ బోన్‌లెస్‌గా. ఈ మాంసంలో కొవ్వు తక్కువ.. కావ్సాల్సిన స్థాయిలో ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి. ఈ కోడి మాంసం మాంసాహార ప్రియులకే కాదు.. శాఖాహారులకు, వివిధ కారణాలతో మాంసం తినడం మానేసిన, మానాలనుకునే వారికి ఒక ప్రత్యామ్నాయమని చెబుతున్నారు.
సెల్ కల్చర్డ్ చికెన్...
ఇది సెల్ కల్చర్డ్ చికెన్. ప్రతి 18–24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం (సెల్ కల్చర్డ్ చికెన్) ఉత్పత్తి చేస్తారు. జంతు కణాల నుంచి ఉత్పత్తి చేసే ఈ సెల్ కల్చర్డ్ చికెన్ త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. కృత్రిమంగా పండిస్తున్న ఈ కోడి మాంసం తినడానికి ఎంతో సురక్షితమని అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) ఇటీవల ధ్రువీకరించింది. ఎఫ్‌డీఎ అనుమతితో అమెరికాలో అప్‌సైడ్ ఫుడ్స్ అనే సంస్థ ఈ సెల్ కల్చర్డ్ చికెన్‌ను ఉత్పత్తి చేస్తోంది. పలు స్టార్టప్ ఫుడ్ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో మాంసం మార్కెట్‌లో కల్చర్డ్ మాంసం ఉత్పత్తులు సింహభాగాన్ని ఆక్రమిస్తాయని, ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
నో యాంటీ బయాటిక్స్...
ఇప్పటికే చంపబడిన జంతువుల నుంచి తయారు చేసే క్లీన్ మీట్‌కు సింగపూర్ రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. తొలిసారి నగ్గెట్స్ రూపంలో మాంసపు ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కణం నుంచి ఉత్పత్తి అయ్యే ఈ కల్చర్డ్ చికెన్‌లో ఒక్క చుక్క యాంటీబయాటిక్స్ ఉపయోగించరు. దీనినే సెల్యులార్ వ్యవసాయం అని పిలుస్తున్నారు. సెల్ కల్చర్డ్ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది. ఒక కోడి నుండి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్ బ్యాంక్ రూపొందిస్తారు. వాటిని ఉక్కు పాత్రలో పరిపక్వం చేస్తారు. పూర్తిస్థాయిలో చికెన్ తయారవడానికి కనీసం 14 రోజులు సమయం పడుతుంది.
2028 నాటికి భారత్‌లోనూ అందుబాటులోకి..
ప్రస్తుతం ప్రతి 10 మంది అమెరికన్లలో ఒకరు కణాల ద్వారా తయారు చేసిన ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ పరిశోధన సంస్థ మింటెల్ అసోసియేట్ తెలిపింది. కోళ్లను వధించగా వెలువడే 10–12 శాతం గ్రీన్‌హౌస్, వాయు ఉద్గారాలకు ఈ సెల్ కల్చర్డ్ చికెన్ ద్వారా చెక్ పెట్టవచ్చంటోంది. కల్చర్డ్ లేదా మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తులకు భవిష్యత్‌లో మంచి డిమాండ్ ఉంటుందని, మాంసం మార్కెట్‌లో కనీసం 10 శాతం ఆక్రమిస్తుందని చెబుతున్నారు. ఈ కృత్రిమ చికెన్ ఈ ఏడాది పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతుండగా, 2028 నాటికి మన దేశంలోనూ అందుబాటులోకి రానుందని చెబుతున్నారు.
పండించిన మాంసం కోసం ఎఫ్‌డీఎ నుంచి అనుమతి పొందిన మొదటి కంపెనీ తమదేనని అమెరికాకు చెందిన అప్‌సైడ్స్ ఫుడ్స్ సీఈవో ఉమా వాలేటి తెలిపారు. భవిష్యత్తులో పశు మాంసం, ఎండ్రకాయలు, బాతు మాంసంతో పాటు ఇతర ఆహారాలను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు.