వికృతంగా ప్రవర్తించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది : ఐఏటీఏ

2022లో విమాన ప్రయాణాల్లో జరిగిన సంఘటనల్లో నిబంధనలు పాటించని ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత పరస్పర దూషణ, మద్యం మత్తు వంటివి కూడా పెరిగినట్లు ఐఏటీఏ తెలిపింది.

Advertisement
Update:2023-06-06 15:20 IST

విమాన ప్రయాణికుల్లో వికృతంగా ప్రవర్తించే వారి సంఖ్య పెరుగుతోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ఒక నివేదికలో పేర్కొన్నది. 2021లో ఇలాంటి సంఘటనలు ప్రతీ 835 విమాన ప్రయాణాల్లో ఒక సంఘటన మాత్రమే నమోదు కాగా... 2022లో ప్రతీ 568 ప్రయాణాల్లో ఒక సంఘటన నమోదు అయ్యిందని వెల్లడించింది. శారీరిక దాడులు కూడా 61 శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని.. కొంత మంది ప్రయాణికులు తమ సొంత మద్యాన్ని తెచ్చుకొని తాగడం కూడా ఎక్కువైందని ఐఏటీఏ నివేదికలో పేర్కొన్నది.

2022లో విమాన ప్రయాణాల్లో జరిగిన సంఘటనల్లో నిబంధనలు పాటించని ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత పరస్పర దూషణ, మద్యం మత్తు వంటివి కూడా పెరిగినట్లు ఐఏటీఏ తెలిపింది. ఒకప్పుడు శారీరిక దాడులు పెద్దగా ఉండేవి కావు.. కానీ 2022లో ఈ సంఘటనలు పెరిగినట్లు నివేదికలో వెల్లడించారు.

మాస్కులు ధరించినప్పటి కంటే.. ఇటీవల కాలంలో నిబంధనలు పాటించని ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 2022లో వీరి సంఖ్య పెరిగినట్లు పేర్కొన్నది. విమాన ప్రయాణ సమయంలో సిగరెట్టు తాగే వారు, సీటు బెల్టు ధరించని వారు, పరిమితికి మించి క్యారీ ఆన్ బ్యాగేజీ తెచ్చుకునే వారు, తమ సొంత మద్యాన్ని తెచ్చుకొని విమానంలో తాగే వారు పెరిగినట్లు నివేదికలో వివరించారు.

చాలా మంది ప్రయాణానికి ముందు విపరీతంగా మద్యం సేవించి విమానాలు ఎక్కుతున్నారని.. అలాంటి వ్యక్తులు కొంత మంది వెంట మరికొంత మద్యాన్ని తెచ్చుకొని ఫ్లయిట్‌లో తాగుతున్నారని తెలుస్తున్నది. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో సాధారమైపోయాయని ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు.

ఇలాంటి వికృత, విపరీత ప్రవర్తన కలిగిన ప్రయాణికులను విచారించడానికి ఒక అంతర్జాతీయ సంధి అవసరం ఉందని.. మాంట్రియల్ ప్రోటోకాల్ 2014 ప్రకారం.. ఇలాంటి ప్రయణికులను సరిహద్దులతో పని లేకుండా విచారించాలని ఐఏటీఏ విజ్ఞప్తి చేసింది. విమానంలో వీరి ప్రవర్తన కారణంగా ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. అందుకే తప్పకుండా చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేయాలని ఐఏటీఏ అన్ని దేశాలకు లేఖలు రాసింది. కానీ కేవలం 45 దేశాలు మాత్రమే అమలు చేయడానికి ఒప్పుకున్నాయి.

Tags:    
Advertisement

Similar News