ఐక్యరాజ్య సమితి సమావేశానికి నిత్యానంద 'కైలాస' రాయబారి హాజరు
కైలాస ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ హిందూ దేశంగా ఆ రాయబారి పేర్కొన్నారు. నిత్యానంద హిందూయిజానికి అత్యున్నత మతాధికారని కూడా ఆ సమావేశంలో తెలిపారు.
తనను తాను దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే నిత్యానంద స్వామి.. కొత్తగా కైలాస అనే దేశాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. కైలాస అనే దేశం అసలు ఉన్నదా లేదా? ఉంటే దానికి గుర్తింపు ఉందా? ఆ దేశం కచ్చితంగా ఎక్కడ ఉన్నది? అని భారతీయులకు చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అనూహ్యంగా కైలాస ప్రతినిధి ఒకరు ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు. 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' తరపున మాతా విజయ ప్రియా నిత్యానంద అనే మహిళ ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరయ్యారు.
ఫిబ్రవరి 22న ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ (సీఈఎస్ఆర్) సమావేశం జెనీవాలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఐక్యరాజ్య సమితి తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. అందులో విజయ ప్రియ నిత్యానంద.. కైలాసకు శాశ్వత రాయబారి అనే హోదాలో కనిపించారు. ఆ సమావేశంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అనే విషయంపై చర్చ జరగగా.. ఆమె కూడా మాట్లాడారు. అంతే కాకుండా తమ దేశ వ్యవస్థాపకుడు నిత్యానందపై.. తాను పుట్టిన భారత దేశం వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదు కూడా చేశారు.
కైలాస ప్రపంచంలోనే మొట్టమొదటి సార్వభౌమ హిందూ దేశంగా ఆమె పేర్కొన్నారు. నిత్యానంద హిందూయిజానికి అత్యున్నత మతాధికారని కూడా ఆ సమావేశంలో తెలిపారు. నిత్యానంద మరుగున పడిన 10వేల హిందూ సంప్రదాయాలను పునరుద్దరిస్తున్నారని ఆమె వెల్లడించారు. హిందూయిజాన్ని రక్షించడానికి, సరికొత్త విధానాలు రూపొందించడానికి కైలాస దేశం కృషి చేస్తోందని ఆమె ఐక్యరాజ్య సమితికి తెలిపారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో కైలాస చాలా విజయవంతమైందని ఆమె వెల్లడించారు.
కాగా, 2019 నవంబర్‌లో నిత్యానందపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గుజరాత్ పోలీసులు నిత్యానంద ఆశ్రమం నుంచి ఒక చిన్నారి కిడ్నాప్ అయిన కేసులో దర్యాప్తు కూడా ప్రారంభించారు. అదే సమయంలో దేశం విడిచి వెళ్లిపోయిన నిత్యానంద.. కైలాస అనే దేశాన్ని గుర్తు తెలియని ప్రదేశంలో నెలకొల్పారు. దానికి గుర్తింపు ఇవ్వాలని పలుమార్లు ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి కూడా చేశారు. ఈ క్రమంలో కైలాస శాశ్వత రాయబారి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.