సామూహిక రాజీనామాల‌తో మ‌స్క్ కు ట్విట్ట‌ర్ ఉద్యోగుల షాక్‌!

ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ ఉద్యోగులందరినీ తొలగిస్తున్న నేపథ్యంలో మిగిలి ఉన్న ఉద్యోగులు కూడా సామూహిక రాజీనామాలకు సిద్దమవుతున్నారు. ఓ సంస్థ నిర్వహించిన పోల్‌లో ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడ్డారు.

Advertisement
Update:2022-11-18 11:25 IST

ట్విట్ట‌ర్ వ్య‌వ‌హారం రోజురోజుకీ సంక్లిష్టంగా మారుతూ సంచ‌ల‌న‌మ‌వుతోంది. ఎల‌న్ మ‌స్క్ ఆ సంస్థ ప‌గ్గాలు చేప‌ట్టినుంచి తీసుకుంటున్న‌ ప‌లు నిర్ణ‌యాలు ఇటు యూజ‌ర్ల‌లోనూ, అటు ఉద్యోగుల‌లోనూ గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయి. ఉద్యోగుల ప‌ట్ల మ‌స్క్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు వారిలో తీవ్ర అభ‌ద్ర‌తాభావాన్ని క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే అధిక‌శాతం మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌టు ప్ర‌క‌టించారు మస్క్. బ్లూటిక్ కోసం చార్జిలు వ‌సూలు చేస్తామ‌ని ప్ర‌క‌టించి యూజ‌ర్ల‌ను గంద‌ర‌గోళ ప‌రిచారు. ఇలా మస్క్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో వారంతా సామూహికంగా రాజీనామాలు చేయాల‌నే సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

సంస్థ‌లో ప‌నిచేయాలంటే ఒత్తిడి వాతావ‌ర‌ణంలో ఎక్కు గంట‌లు ప‌నిచేయాల్సిందేనంటూ మ‌స్క్ అల్టిమేటం జారీ చేసిన మరుసటి రోజే వంద‌లాది మంది ఉద్యోగులు రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డ్డారు. దీంతో సెల్యూట్ ఎమోజీలు ,వీడ్కోలు సందేశాలతో కంపెనీ అంతర్గత చాట్ గ్రూప్ లు నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నందున, బ్యాడ్జ్ యాక్సిస్ త‌గ్గించి కంపెనీ లో ఎంత‌మంది ఉంటార‌నే గందరగోళాన్ని నివారించడానికి ట్విట్టర్ సోమవారం వరకు తన కార్యాలయాలను మూసివేసింది.

వర్క్ ప్లేస్ యాప్ 'బ్లైండ్' నిర్వహించిన పోల్‌లో 180 మంది ఉద్యోగుల్లో 42 శాతం మంది సంస్థను వదిలివెళ్లేందుకే మొగ్గు చూపారు. పావువంతు మంది మాత్రం అయిష్టంగానే కొనసాగేందుకు ఇష్టపడగా 7 శాతం మంది సంస్థను అంటిపెట్టుకుని ఉండేందుకే ఓటు వేశారు.

"క్లిష్టమైన కీల‌క‌మైన విభాగాల‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం టీమ్ ల‌న్నీ స్వచ్ఛందంగా కంపెనీని విడిచిపెడుతున్నాయి. దీనివ‌ల్ల కంపెనీకి కోలుకోలేని ఇబ్బంది ఏర్ప‌డుతుంది. మేము అనేక‌ ర‌కాల నైపుణ్యం కలిగిన ప్రొఫెష‌న‌ల్స్ ము. మేము ఉండాలో లేదా అనే విష‌యాల‌పై మస్క్ మాకు ఎటువంటి స్ప‌ష్ట‌మైన అభిప్రాయాన్ని చెప్ప‌లేదు. '' అని ఓ ఇంజనీర్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News