ట్రంప్‌కు భారీ జరిమానా.. - పరువు నష్టం కేసులో న్యాయస్థానం తీర్పు

కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్‌.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా చేశారంటూ కరోల్‌ ఇటీవల దావా వేశారు.

Advertisement
Update:2024-01-27 15:32 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారు జీన్‌ కరోల్‌కు ఏకంగా 83.3 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైమాటే) పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్‌.. ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా చేశారంటూ కరోల్‌ ఇటీవల దావా వేశారు. జీన్‌ కరోల్‌ను ట్రంప్‌ లైంగికంగా వేధించారని గతేడాది మే నెలలో కోర్టు నిర్ధారించింది. అందుకుగాను ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే, కరోల్‌ తన రచనలను విక్రయించుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్‌ విమర్శించడంతో పరువు నష్టం కేసు దాఖలైంది. దీనిపైనే తాజాగా మన్‌హట్టన్‌ ఫెడరల్‌ కోర్టు విచారించి.. ఆమెకు అదనంగా మరో 83.3 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ జరిమానాపై ట్రంప్‌ స్పందిస్తూ బైడెన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఈ తీర్పు హాస్యాస్పదం. మన న్యాయ వ్యవస్థ నియంత్రణ కోల్పోయింది. దీన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు‘ అని మండిపడ్డారు. దీనిపై తాను పై కోర్టులో అప్పీలు చేయనున్నట్లు తెలిపారు.

వివాదమేంటంటే...

1996లో మన్‌హట్టన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో కరోల్‌.. ట్రంప్‌కు పరిచయమయ్యారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దాంతో తాను షాక్‌కు గురయ్యానని.. అత్యాచార బాధితురాలిగా తనను తాను చూసుకోలేకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటన జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ పుస్తకంలో ఆమె వెల్లడించిన వివరాలను న్యూయార్క్‌ మ్యాగజైన్‌ 2019లో ప్రచురించింది. వాటిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ఆమెనుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Tags:    
Advertisement

Similar News