టాప్ సీక్రెట్ డాక్యుమెంట్లను పత్రికల్లో దాచేసిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను వైట్ హౌజ్ ను వీడిపోయేప్పుడు ప్రభుత్వానికి చెందిన పలు కీలక పత్రాలను తనతో పాటు తీసుకెళ్ళాడనే ఆరోపణలున్నాయి. ఫెడరల్ బ్యూరో అధికారులు లోగడ ఆయన ఇంటిపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లను ట్రంప్ తన ఇంట్లో పత్రికల్లో దాచిపెట్టాడని ఎఫ్బీఐ ఆరోపించింది.

Advertisement
Update:2022-08-27 11:25 IST

అత్యంత రహస్య డాక్యుమెంట్లను అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మ్యాగజైన్లు, వార్తాపత్రికల్లో కలిపేసినట్టు తెలిసింది. ఫ్లోరిడాలోని ఈయన ఇంటి నుంచి ఫెడరల్ బ్యూరో అధికారులు లోగడ మొత్తం 15 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. .. వాటిలో 14 బాక్సుల్లో క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు చాలా ఉన్నాయి. ఈ పత్రాల్లోకీలకమైనవాటిని ఆయన మ్యాగజైన్లు, డైలీలతో బాటు తన వ్యక్తిగత పత్రాల్లో కూడా కలిపేశారని ఎఫ్ బీ ఐ తన అఫిడవిట్ లో తెలిపింది. ఇది వాటిని దాచిపెట్టడమేనని 32 పేజీల అఫిడవిట్ లో అభిప్రాయపడింది. వైట్ హౌస్ ను వీడి వెళ్లే ముందు ట్రంప్ ఇలాంటి రహస్య డాక్యుమెంట్లను తన ఇంటికి తీసుకువెళ్లినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇన్ని నెలలు గడిచినా వీటి భద్రత విషయంలో ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం కూడా ఉందని వారు తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2024 లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ డాక్యుమెంట్ల విషయం కీలకంగా మారుతోంది. అనధికారిక స్థలాల్లో క్లాసిఫైడ్ సమాచారాన్ని స్టోర్ చేయడం, దాచిపెట్టడం చట్ట విరుద్ధమని ఎఫ్ బీ ఐ ఏజెంట్ ఒకరు అఫిడవిట్ మొదటి పేజీలో స్పష్టం చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో ఇది బయటపడిందని, ఫెడరల్ చట్టాల ఉల్లంఘన జరిగిందని ఆయన అన్నారు. గూఢచర్య చట్టం కింద రక్షణకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడం, రికార్డులను తారుమారు చేయడం ఒక విధంగా నేరంగా పేర్కొన్నారు.

ఈ నెల 8 న అధికారులు ట్రంప్ నివాసంలో సోదాలు జరిపి 11 సెట్ల క్లాసిఫైడ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు జనవరిలో కూడా జాతీయ పురావస్తు శాఖ అధికారులు ఆయన ఇంటి నుంచి కొన్ని రికార్డులు సేకరించారు. ఇదే విషయాన్ని ఎఫ్ బీ ఐ తన అఫిడవిట్ లో గుర్తు చేసింది. ఇలాంటి రహస్యమైన పత్రాలను కొన్ని పత్రికలు, డైలీలు, తన వ్యక్తిగత డాక్యుమెంట్లలో ట్రంప్ కలిపేయడం ఆయన బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోందని సీఐఏ మాజీ సీనియర్ అధికారి డగ్లస్ లండన్ విమర్శించారు. అయితే తన నివాసంలో సోదాలు జరపడం, తన వ్యక్తిగత పత్రాలను స్వాధీనం చేసుకోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ట్రంప్ ఆరోపించారు. దీనిపై కోర్టుకెక్కుతానని ఆయన హెచ్చరించారు. డాక్యుమెంట్లను డీక్లాసిఫై చేసే అధికారం తమ క్లయింటుకు ఉందని, క్రిమినల్ శాంక్షన్ కి ఇది లోబడి లేదని ట్రంప్ లాయర్ ఎవాన్ కార్కోరన్ వాదిస్తున్నారు.




Tags:    
Advertisement

Similar News