ట్రంప్‌తో కలిసి రెట్టింపు వేగంతో పనిచేస్తాం
చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామన్న మోడీ
అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. మోడీ తనకు మంచి స్నేహితుడని, రానున్న నాలుగేళ్ల స్నేహాన్ని కొనసాగిస్తామని ట్రంప్ తెలిపారు. భారత్‌కు మోడీ లాంటి నాయకుడు ఉండటం గర్వకారణమన్నారు. ట్రంప్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉన్నదని ప్రధాని మోడీ అన్నారు. భారత్-అమెరికా వ్యూహాత్మాక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. రెట్టింపు వేగంతో పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
అంతకుముందు ప్రధాని మోడీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్ ఎక్స్ సీఈవో, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్‌లో మోడీతో సమావేశమయ్యారు. మోడీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్‌హౌస్‌కు ఆయన గురువారం తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావశంలో ఆత్మీయంగా మాట్లాడార. అంతరిక్షం, సాంకేతితక, నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్‌తో చర్చించినట్లు మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ట పాలన కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొస్తున్న సంస్కరణలను ఆయనకు వివరించినట్లు చెప్పారు. మరోవైపు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్ వాల్జ్ కూడా మోడీతో సమావేశమయ్యారు. సంబంధిత వివరాలను ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్ అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతితక, భద్రతా రంగాలు కీలకమని, వాటిపై వాల్జ్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు. ఏఐ, సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. వాల్జ్‌ను భారత్ కు గొప్ప స్నేహితుడిగా అభివర్షించారు. ఈ భేటీల్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు