ఇది బైక్ ర్యాలీ కాదు... ఆహారం కోసం అగచాట్లు

గోధుమ పిండి లోడ్‌తో వెళుతున్న ఓ ట్రక్కు నుంచి పిండి బ్యాగ్‌ను కొనుగోలు చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఏకంగా ట్రక్కు వెనుకభాగంలో ఎక్కి ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఆ వెనుకే వందలాది మంది బైక్‌లతో ట్రక్కును వెంబడిస్తూ వెళ్లారు. ఈ వీడియో చూస్తుంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Update:2023-01-16 12:23 IST

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూస్తే ఎవరికైనా బైక్ ర్యాలీ జరుగుతుందేమో అనిపిస్తుంది. కానీ ఇది బైక్ ర్యాలీ కాదు. ఆకలితో అలమటిస్తున్న పాకిస్తాన్ ప్రజలు గోదుమ పిండి బస్తాలు తీసుకెళ్తున్న ట్రక్ వెంబడి పడుతున్న దృశ్యాలు.

ఇటీవలి కాలంలో పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్రజలకు కొందామన్నా ఆహారం దొరకడం లేదు. ఒక వేళ కొద్దొ గొప్పో దొరికినా ఐదారు రెట్లు ధరలు పెరిగి పోయాయి. సరిపడ ఆహారం దొరకక ఉన్న కొద్ది పాటి ఆహారం కోసం ప్రజలు కొట్టుకుంటున్నారు.

గోధుమ పిండి లోడ్‌తో వెళుతున్న ఓ ట్రక్కు నుంచి పిండి బ్యాగ్‌ను కొనుగోలు చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఏకంగా ట్రక్కు వెనుకభాగంలో ఎక్కి ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఆ వెనుకే వందలాది మంది బైక్‌లతో ట్రక్కును వెంబడిస్తూ వెళ్లారు. ఈ వీడియో చూస్తుంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోను నేషనల్ ఈక్వాలిటీ పార్టీ JKGBL చైర్మన్ ప్రొఫెసర్ సజ్జాద్ రాజా చేసిన ట్వీట్ చేశారు.

"ఇది మోటారుసైకిల్ ర్యాలీ కాదు, కేవలం 1 బ్యాగ్ కొనాలనే ఆశతో పాకిస్తాన్‌లోని ప్రజలు గోధుమ పిండిని తీసుకెళ్తున్న ట్రక్కును వెంబడిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు కళ్లు తెరవాలి. మీరు పాకిస్తాన్ లో లేకపోవడం మీ అదృష్టం. మేము మా గురించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదు. మాకు ఏదైనా భవిష్యత్తు ఉందా?" అని ఆయన కామెంట్ చేశారు.

కరెన్సీ నోట్ల కట్టలను ఊపుతూ బైకర్లు ట్రక్కు వెంటపడి దానిని ఆపేయడం వీడియోలో ఉంది. ఒక జంట పిండి బస్తాను పొందగలిగారు. ఆ వెంటనే ఇతరులు ట్రక్కును చుట్టుముట్టారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో గోధుమ పిండి కొరత తీవ్రంగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది. గత వారం నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లలో పిండి ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక ప్యాకెట్ పిండిని 3000 పాకిస్తాన్ రూపాయలకు విక్రయిస్తున్నట్లు మీడియా రిపోర్టులు చెప్తున్నాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ఆహార సంక్షోభం అంచున ఉంది. ఈ ఆహార‌ కొరతకు ఇస్లామాబాద్, పీఓకే ప్రభుత్వాలే బాధ్యులని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ గోధుమల సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. ఇతర నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

ఆదివారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆహారం కోసం బారులు తీరిన జనం అసహనంతో గోధుమ పిండి సంచులతో నిండిన ట్రక్కుపై రాళ్ళు విసిరారు. ఆ దాడిలో డ్రైవర్ గాయపడ్డాడు. దాంతో పోలీసులు జనంపై లాఠీచార్జ్ చేశారని పాకిస్తాన్ దినపత్రిక డాన్ రిపోర్ట్ చేసింది.

Tags:    
Advertisement

Similar News