అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడే
కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య హోరాహోరీ పోరు..కీలకం కానున్నతటస్థ ఓటర్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనున్నది. అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అగ్రరాజ్యం అన్ని ఏర్పాటు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది.ట్రంప్, హారిస్ ప్రచారాలు ముగిశాయి. ఫిలడెల్ఫియాలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ చివరి ప్రసంగం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మిషిగాన్‌లో నిర్వహించిన చివరి సభలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మాట్లాడారు. రెండోసారి ఎలాగైనా అధికారాన్ని సాధించాలనే కసితో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించడానికి హారిస్ సర్వశక్తులొడ్డుతున్నారు. ఇప్పటికే 6.8 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తటస్థ ఓటర్లు ఎవరివైపు మొగ్గితే వారికి విజయం దక్కతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వింగ్ స్టేట్స్‌లో హారిస్ కంటే ట్రంప్ 1.8 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైంది. అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నిక. అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించేది ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు మాత్రమే. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లున్నాయి. ఇందులో 270 సీట్లు వచ్చిన వారే అధ్యక్షులవుతారు. ఎలక్ట్రోరల్ కాలేజీలో సమాన ఓట్లు వస్తే దిగువ సభ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నది.అమెరికా కొత్త అధ్యక్షుడు 2025 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఎన్నికల పరిశీలనకు న్యాయశాఖ.. రిపబ్లికన్ల అభ్యంతరం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పరిశీలనకు న్యాయశాఖ వెళ్లనున్నది. దీనిపై రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల రోజు వారిని అనుమతించబోమని రిపబ్లికన్ లడ్ రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఫెడరల్ ఓటింగ్ చట్టాల ప్రకారం ఎన్నికలను పరిశీలించే ప్రక్రియ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది. కానీ ఫెడరల్ ఎలక్షన్ మానిటర్లను అనుమతించబోమని ఫోరిడా, టెక్సాస్ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై మిస్సోరి ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఎన్నికల బరిలో 35 మందికిపైగా భారత సంతతి వ్యక్తులు
అమెరికా ఎన్నికల బరిలో 35 మందికిపైగా భారత సంతతి వ్యక్తులున్నారు. ఇండో అమెరికన్లు చట్టసభలతో పాటు స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్నారు. అశ్విన్ రామస్వామి జార్జియా రాష్ట్ర సెనేటర్ పదవికి పోటీస్తుండగా.. ప్రతినిధుల సభకు 9 మంది భారత అమెరికన్లు పోటీ పడుతున్నారు.
యూఎస్ ఓటర్లను ప్రభావితం చేస్తున్న రష్యా, ఇరాన్: ఫెడరల్ ఏజెన్సీ
యూఎస్ ఓటర్లను రష్యా ఏవిధంగా ప్రభావితం చేస్తుందో ఫెడరల్ ఏజెన్సీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎన్నికల భద్రతా ఏజెన్సీలు రెండు ఉదాహరణలతో వివరించాయి. యూఎస్ ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించేందుకు విదేశీశక్తులు యత్నిస్తున్నాయని ఆరోపించాయి. ఇలాంటి అనుమానాలతో ఎన్నికల అధికారులపై దాడులు జరగొచ్చని అభిప్రాయం వ్యక్తమౌతున్నది.
ఓడిపోయే అవకాశం ఉన్నది.. కానీ లీడ్‌లో ఉన్నా: ట్రంప్
మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీరు ఏరకంగానైనా ఓడిపోయే అవకాశం ఉన్నదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. అవును.. నేను ఊహిస్తున్నాను. మీకు తెలుసా? అంటూ తాను గణనీయమైన లీడ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కొన్నిసార్లు చెడు జరగొచ్చు.. అలా జరుగుతూ ఉంటుంది. కానీ అది కూడా ఆసక్తికరమేనని వ్యాఖ్యానించారు.