టర్కీలో 35 వేలకు చేరిన మృతుల సంఖ్య...ఈ రోజు మరో సారి కంపించిన భూమి
టర్కీలో సహాయ కార్యక్రమాలు సాగుతున్నప్పటికీ జరిగిన విధ్వంసంతో పోల్చితే అవి ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. అనేక దేశాలు టర్కీలో సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో ఇప్పటికీ శిథిలాలు పూర్తిగా తీయలేకపోయారు.
గతవారం వచ్చిన భారీ భూకంపం వల్ల టర్కీ, సిరియా దేశాల్లో మరణించిన వారి సంఖ్య దాదాపు 35 వేలకు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టర్కీలో మళ్ళీ భూమి కంపించింది. ఆదివారం టర్కీ దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దాంతో ప్రజలు బైటికి పరుగులు తీశారు.
టర్కీలో సహాయ కార్యక్రమాలు సాగుతున్నప్పటికీ జరిగిన విధ్వంసంతో పోల్చితే అవి ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. అనేక దేశాలు టర్కీలో సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో ఇప్పటికీ శిథిలాలు పూర్తిగా తీయలేకపోయారు. వాటి కింద ఇంక మంది ఉన్నారో, వారు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా అర్దం కాని పరిస్థితి.
భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అక్కడక్కడ కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. 92 వేల మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే భూకంప మృతుల సంఖ్య 50వేలు దాటవచ్చని ఐక్యరాజ్య సమితి సహాయ కార్యక్రమాల విభాగాధిపతి మార్టిన్ గ్రిఫిత్స్ తెలిపారు.
కాగా, భూకంపాలలో కుప్పకూలిన భవనాల నిర్మాణ లోపంతో సంబంధం ఉన్న 134 మందికి టర్కీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు టర్కీ న్యాయ మంత్రి బెకిర్ బోజ్‌డాగ్ ఆదివారం తెలిపారు.నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు బోజ్‌డాగ్ విలేకరులకు తెలిపారు.
దక్షిణ అడియామాన్ ప్రావిన్స్‌లో భూకంపంలో ధ్వంసమైన అనేక భవనాల కాంట్రాక్టర్లు యవుజ్ కరాకుస్, సెవిలే కరాకుస్ జార్జియాకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా ఆదివారం నివేదించింది.
గాజియాంటెప్ ప్రావిన్స్‌లో కూలిపోయిన భవనం కాలమ్‌ను కత్తిరించినందుకు మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారిక అనడోలు ఏజెన్సీ నివేదించింది.
విపత్తు జరిగిన ఏడవ రోజు కూలిపోయిన బహుళ అంతస్థుల భవనాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో అని వేలాది మంది వాలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది వెతుకుతున్నారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారు ఇంకా సజీవంగా ఉన్నారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.
విపత్తు జరిగిన 150 గంటల తర్వాత రక్షించిన ఓ బాలిక వీడియోను టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “కొద్దిసేపటి క్రితం సిబ్బంది రక్షించారు. ఆశ ఇంకా కొనసాగుతున్నది!" అని ఆయన కామెంట్ చేశారు.
భూకంపం సంభవించిన 160 గంటల తర్వాత హటే ప్రావిన్స్‌లోని అంటక్యా జిల్లాలో 65 ఏళ్ల వృద్ధ మహిళలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారని అనడోలు ఏజెన్సీ నివేదించింది.
భూకంపం సంభవించిన 150 గంటల తర్వాత ఆదివారం మధ్యాహ్నం హటే ప్రావిన్స్‌లోని అంటక్యా జిల్లాలో శిథిలాల నుండి చైనీస్,స్థానిక టీంలు ఓ వ్యక్తిని రక్షించారు.
ఇక ట్రకీ, సిరియా దేశాలకు సహాయం చేయడానికి భారత్ తో సహా అనేక దేశాలు సహాయక బృందాలను పంపడమే కాక ఆహార, ఇతర వస్తువులను కూడా ఆ దేశాలకు పంపారు.
ఆదివారం, అల్జీరియా, లిబియా కూడా భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక వస్తువులతో కూడిన విమానాలను పంపాయి.
మరో వైపు విదేశీ దేశాధినేతలు , మంత్రులు సంఘీభావం తెలిపేందుకు టర్కీ, సిరియా పర్యటనలను ప్రారంభించారు.
గ్రీస్ విదేశాంగ మంత్రి నికోస్ డెండియాస్ ఆదివారం టర్కీలో పర్యటించి ఆ దేశానికి మద్దతు తెలిపారు.
భూకంప బాధిత టర్కీని సందర్శించిన తొలి విదేశీ అధినేత ఖతార్ ఎమిరేట్స్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆదివారం ఇస్తాంబుల్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో సమావేశమయ్యారు.
ఆదివారం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సిరియాను సందర్శించారు.