చైనాను వణికిస్తున్న కొత్త వైరస్..లక్షణాలివే
చైనాను వణికిస్తున్న వైరస్ పై భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌పై భారత కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులను నిశితంగా పరిశీలించాలని సూచించింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్న భారత ప్రభుత్వం… ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అనుబంధ ఏజెన్సీల నుంచి డిసెంబర్ 16-22 మధ్య వచ్చిన డేటా ప్రకారం చైనాలో సీజనల్ ఇన్ ఫ్లుఎంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్.. హ్యూమన్ మెటాన్యూమోవైరస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ లు తీవ్రమయ్యాయి అని పేర్కొంది.
HMPV అనే వైరస్ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ మాదిరిగా న్యూమోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది సోకితే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, లక్షణాలు కనిపిస్తాయి. చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమో వైరస్ వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు డీజీహెచ్ఎస్ ఉన్నతాధికారి డాక్టర్ అతుల్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు అందరిలో కలవకపోవడమే మంచిదన్నారు. అలా చేస్తే ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి ఉండదన్నారు. మామూలుగా దగ్గు, తుమ్ము వస్తే కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలని సూచించారు.