ట్రంప్ ప్రతీకార సుంకాల వేళ భారత్, ఈయూ కీలక ప్రకటన
ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ;
ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని ఆందోళన వ్యక్తమౌతున్న వేళ భారత్, ఐరోపా యూనియన్ (ఈయూ) కీలక ప్రకటన చేశాయి. తమ వద్ద దీర్ఘకాలికంగా చర్చల్లో నానుతున్న మెగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరి నాటికి పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సంప్రదింపులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపాయి. రక్షణ, భద్రత, సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని భారత్, ఈయూ నిర్ణయించాయి. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. తమ సన్నిహిత మిత్ర దేశాలైన జపాన్ , దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న తరహాలో భారత్‌తోనూ భద్రత, రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తన్నట్లు లేయన్ తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గదర్శనం చేసే రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేశామని తదుపరి భారత్, ఈయూ శిఖరాగ్ర సదస్సులో దాన్ని ఆవిష్కరిస్తామని ప్రధాని మోడీ తెలిపారు.