`రివెంజ్ పోర్న్‌` కేసులో భారీ జ‌రిమానా.. - బాధితురాలికి రూ.9,986 కోట్ల ప‌రిహారం చెల్లించాల‌ని కోర్టు ఆదేశం

2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్ కౌంటీ సివిల్ కోర్టులో పిటీష‌న్‌ వేసింది. ఈ కేసులో నిందితుడికి న్యాయ‌స్థానం భారీ జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

Advertisement
Update:2023-08-17 12:03 IST

`రివెంజ్ పోర్న్` కేసులో అమెరికాలోని ప్ర‌త్యేక న్యాయ‌స్థానం నిందితుడికి భారీ జ‌రిమానా విధించింది. బాధితురాలికి రూ.9,986 కోట్ల ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశించింది. ఇంత‌కీ ఈ `రివెంజ్ పోర్న్‌` అంటే ఏమిటంటే.. ఓ వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను మాజీ భాగస్వామి ఇంటర్‌నెట్‌లో షేర్ చేయడం. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం.. వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను 'రివెంజ్ పోర్న్'గా వ్యవహరిస్తారు.

అమెరికాకు చెందిన ఓ మహిళ (డీఎల్ అని మాత్రమే పేర్కొంది) మార్క్వెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించింది. షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత 2021 అక్టోబరులో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. అక్కడి నుంచి ఆమెకు అతడి వేధింపులు మొదలయ్యాయి. గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకొన్న ఫొటోలను శృంగార వెబ్‌సైట్‌ల‌లో పెట్టాడు. ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్, ఈ-మెయిల్ నుంచి సేకరించిన వ్యక్తిగత ఫొటోలను తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించి వాటిలో పోస్టు చేశాడు. ఆ ఫొటోల లింకులను బాధితురాలి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపాడు. 'వాటిని ఇంటర్నెట్ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు నీ జీవితం సరిపోదు' అంటూ ఆమెకు మెసేజ్‌లు పంపించేవాడు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన న్యాయం జరగలేదని భావించిన ఆమె.. 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్ కౌంటీ సివిల్ కోర్టులో పిటీష‌న్‌ వేసింది. ఈ కేసులో నిందితుడికి న్యాయ‌స్థానం భారీ జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్ డాలర్లు (రూ.1,664 కోట్లు), ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్ డాలర్లు (రూ.8,322 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News