వైద్య రంగంలో స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో ను వరించిన నోబెల్ ప్రైజ్
వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో ను వరించింది. అంతరించిపోయిన ఆదిమానవులు (హోమినిన్‌ల) జన్యువులు,మానవ పరిణామ క్రమానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను సైంటిస్ట్ స్వంటే పాబో కు ఈ బహుమతి లభించింది.
స్వీడిష్ పరిశోధకుడు స్వాంటే పాబోను ప్రఖ్యాత నోబెల్ ప్రైజ్ వరించింది. వైద్యరంగంలో ఆయన చేసిన విశేష కృషికి 2022 సంవత్సరానికి గాను ఈ బహుమతికి ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ సోమవారంనాడు ప్రకటించింది. "అంతరించిపోయిన ఆదిమానవులు (హోమినిన్‌ల) జన్యువులు,మానవ పరిణామ క్రమానికి సంబంధించిన" ఆవిష్కరణలకు గాను సైంటిస్ట్ స్వంటే పాబో 2022 ఫిజియాలజీ లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారని కమిటీ కార్యదర్శి థామస్ పెర్ల్ మాన్ ప్రకటించారు, వైజ్ఞానిక ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బహుమతిని స్వీడన్ యొక్క కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రదానం చేస్తుంది. మరియు దీని విలువ 10 మిలియన్ స్వీడిష్ క్రౌన్స్ ($900,357).
ఇతర రంగాల్లోనూ నోబెల్ విజేతలను రోజుకొకరి చొప్పున ప్రకటించనున్నారు. రేపు (అక్టోబరు 4) భౌతికశాస్త్ర విజేతను, అక్టోబరు 5న రసాయనశాస్త్ర విజేతను, అక్టోబరు 6న సాహిత్యంలో నోబెల్ విజేతను, అక్టోబరు 7న నోబెల్ శాంతి బహుమతి విజేతను, అక్టోబరు 10న ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేత పేరును వెల్లడించనున్నారు.
స్వీడిష్ ఆవిష్కర్త, సంపన్న వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో పేర్కొన్న విధంగాఆయన పేరు మీద ఈ నోబెల్ ప్రైజ్ ఏర్పాటు చేశారు. సైన్స్, సాహిత్య రంగాలలోనూ , శాంతికోసం పాటుబడే వారికి బహుమతులను 1901 నుంచి అందిస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక రంగం లో విశేష కృషి చేసిన ఆర్ధిక నిపుణులకు కూడా ఈ బహుమతి ఇస్తున్నారు.