సిన్వర్ చివరి క్షణాలు.. డ్రోన్ వీడియో వైరల్
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంతర్జాతీయ అధికార ప్రతినిధి
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ మిలిటెంట్ గ్రూప్ అధినేత, గత అక్టోబర్ 7 నాటి దాడులకు సూత్రధాని అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హతమార్చింది. కాగా.. చనిపోయే ముందు సిన్వర్ చివరి కదలిలకు సంబంధించిన దృశ్యాలు బైటికి వచ్చాయి. ఈ కదలికలను ఇజ్రాయెల్ డ్రోన్ రికార్డు చేసింది. ఓ శిథిల భవనంలోని సోఫాలో సిన్వర్ కూర్చుని ఉండగా.. డ్రోన్ అతడిని చిత్రీకరించింది. దాన్ని గమనించిన ఆయన ఓ కర్ర లాంటి వస్తువును దానిపైకి విసిరినట్లు వీడియోలో దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంతర్జాతీయ అధికార ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దీనిపై ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మాట్లాడుతూ.. 'శిథిలమైన భవనం లోపల హమాస్ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా? అనేది తెలుసుకోవడానికి డ్రోన్‌ను పంపించాం. మొదట ఆ వ్యక్తిని సిన్వర్ అనుకోలేదు. కేవలం మిలిటెంట్ అనే భావించాం. ఆ తర్వాత భవనంపై మరోసారి బాంబు దాడి చేశాం. దీంతో భవనం కుప్పకూలి అతను మృతి చెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతను సిన్వర్ అని తేలిది. ఆయన శరీరంపై బుల్లెట్ ఫ్రూఫ్‌జాకెట్, గ్రనేడ్లు ఉన్నాయి' అని వెల్లడించారు.
దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ముగ్గురిని మట్టుబెట్టింది. మొదట సిన్వర్ మృతి చెందిన విషయాన్ని వాళ్లు గుర్తించలేదు. తర్వాత నిఘావర్గాలు రంగంలోకి దిగి సిన్వర్ మృతదేహాన్ని గుర్తించాయి. గతంలో అతను ఇజ్రాయెల్ కష్టడీలో ఉండటంతో సేకరించిన డీఎన్‌ఏ, దంత నమూనా సాయంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయగా అది హమాస్ అగ్రనేత అని తేలింది. మరోవైపు ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసిన పలువురిని సిన్వర్ తన రక్షణ కవచంగా వినియోగించేవాడు. గాజా యుద్ధానికి కారణహైన అక్టోబర్ 7 మారణహోమానికి సూత్రధారి సిన్వరేనని మొదటి నుంచి ఇజ్రాయెల్ బలంగా విశ్వసిస్తున్నది. గత ఏడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ చేసిన దాడుల్లో 1200 మంది మృతి చెందగా.. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. ఇంకా హమాస్ వద్ద 100 మంది బందీలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంవత్సరకాలంగా ఐడీఎఫ్ సొరంగాల్లో ఆయన కోసం వేట కొనసాగిస్తున్నది. కొన్నిసార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడని పేర్కొన్నది. అయితే దాడి తర్వాత ఆ భవనంలో ముగ్గురు తప్పా మరెవరీ ఆచూకీ లభ్యం కాలేదు. గాజా సొరంగాల్లో వారి దాచిపెట్టారని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.