అమెరికాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు... 10 మంది దుర్మరణం
అమెరికాలోని ఓ వాల్ మార్ట్ స్టోర్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు. పోలీసుల కాల్పుల్లో ఆ దుండగుడు కూడా మృతి చెందాడు.
అమెరికాలోని వర్జీనియాలోని చీసాపీక్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
"కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే సుశిక్షితులైన తమ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారని, ఆధారాలు సేకరిస్తున్నారని వారి పని వారు చేసుకునేలా సహకరించాలని "అని చీసాపీక్ సిటీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది.
చీసాపీక్ నగరంలోని వాల్‌మార్ట్ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో జరిగిన కాల్పులపై రాత్రి పొద్దుపోయిన తర్వాత (స్థానిక కాలమానం ప్రకారం 10:12 గంటలకు) పోలీసులు స్పందించారు, దుకాణంలోకి ప్రవేశించిన పోలీసులు, పలువురు వ్యక్తులు చనిపోయినట్లు మరికొందరు గాయపడినట్లు గుర్తించారు.
మృతుల సంఖ్య ఇప్పటి వరకు నిర్థారణ కాలేదు కానీ 10 మంది కంటే ఎక్కువగానే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది. .సంఘటనా స్థలం వద్ద పెద్ద ఎత్తున నేరపరిశొధన బృందాలు, పోలీసులు మోహరించి ఉన్నారు.